మద్యంపై ప్రేమ.. రైతులపై నిర్లక్ష్యమా?

ABN , First Publish Date - 2020-05-10T07:00:23+05:30 IST

రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసేవారు లేక, నిల్వ చేసుకొనే సౌకర్యం లేక అవస్థలు పడుతుంటే, పాలకులు మాత్రం మద్యం .

మద్యంపై ప్రేమ.. రైతులపై నిర్లక్ష్యమా?

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు


పిడుగురాళ్ల, మే 9: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు కొనుగోలు చేసేవారు లేక, నిల్వ చేసుకొనే సౌకర్యం లేక అవస్థలు పడుతుంటే, పాలకులు మాత్రం మద్యం అమ్మకాలపైనే దృష్టి సారించటం ఎంతవరకు సమంజమని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. మద్యం అమ్మకాలపై ఉన్న ప్రేమ రైతులపై ఎందుకు చూపటంలేదని ఓ ప్రకటనలో మండిపడ్డారు. తెలంగాణాలో రూ.30వేల కోట్ల నిధులతో గ్రామాల్లోకి అధికారులు వెళ్లి పంటలను కొనుగోలు చేస్తుంటే ఆంధ్రాలో మాత్రం చేతులు ముడుచుకొని కూర్చొందన్నారు. పత్తికి రూ.10వేలు, మిరపకు రూ.20వేలు, ధాన్యాన్ని రూ.2వేలతో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పల్నాడు ప్రాంతంలో ఎందరో రైతులు తక్కువ ధరకే పంట ఉత్పత్తులను దళారులకు అమ్మి, నష్టపోతున్నారన్నారు. 


విత్తనాలను ప్రభుత్వమే ఉచితంగా అందించాలని ఆయన తెలిపారు. ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్‌తోఫా అందించాలని ఆయన కోరారు. మాచవరం మండలంలో మద్యం షాపులపై మహిళల నుంచి వ్యతిరేకత వస్తున్నా ఎందుకు తొలగించటం లేదని ఆయన ప్రశ్నించారు.  దాచేపల్లి మండలంలోని జేపీ సిమెంట్స్‌ గతంలో మూతపడగా తాను, అప్పటి ఎంపీగా ఉన్న మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి సిమెంట్స్‌ ఫ్యాక్టరీని తెరిపించటంతో పాటు  జీతాలు ఇప్పించి, ఆదుకొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు  సిమెంట్స్‌ పరిశ్రమ మూతపడి వేలాది మంది కార్మికులు ఉపాధి పోయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవటం విచారకరమన్నారు. ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి, కార్మికులను ఆదుకోవాలని కోరారు.

Updated Date - 2020-05-10T07:00:23+05:30 IST