రైతులకు అండగా ఉన్నందుకే అక్రమ కేసులు

ABN , First Publish Date - 2020-11-16T05:10:36+05:30 IST

మాచవరం మండలంలోని చెన్నాయపాలెం గ్రామంలో సరస్వతి సిమెంట్స్‌ ఫ్యాక్టరీ పేరుతో కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో రైతులకు అండగా నిలబడినందుకే తనపై అక్రమకేసులు పెట్టి వైసీపీ నాయకులు వేధిస్తున్నారనిమార్కెట్‌ యార్డు మాజీ డైరెక్టర్‌ యలమందనాయక్‌ ఆరోపించారు.

రైతులకు అండగా ఉన్నందుకే అక్రమ కేసులు

 వైసీపీలోకి రావాలంటూ బెదిరింపులు

యలమందనాయక్‌ ఆవేదన 

 

మాచవరం, నవంబరు15: మాచవరం మండలంలోని చెన్నాయపాలెం గ్రామంలో సరస్వతి సిమెంట్స్‌ ఫ్యాక్టరీ పేరుతో కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలో రైతులకు అండగా నిలబడినందుకే తనపై అక్రమకేసులు పెట్టి వైసీపీ నాయకులు వేధిస్తున్నారనిమార్కెట్‌ యార్డు  మాజీ డైరెక్టర్‌ యలమందనాయక్‌ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీలో చేరితే ఇళ్లు మంజూరు చేయిస్తామని, ఉన్న అప్పులు తీరుస్తామని దీనికి ఒప్పుకోకపోవటంతో అక్రమకేసులు పెట్టి జైలుకు పంపారంటూ బెదిరించారని వాపోయారు. 

చెన్నాయపాలెం గ్రామంలో సరస్వతి సిమెంట్స్‌ వారు సుమారు 1,200ఎకరాలు.. ఎకరం రూ.3లక్షల చొప్పున, బీడు  భూములను  ఎకరం రూ.1.80లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం భూములు కొనుగోలు సమయంలో ఫ్యాక్టరీ నిర్మాణం వెంటనే చేపట్టి గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు, గ్రామంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తామని నమ్మబలికారు. కొన్నేళ్లు గడిచినప్పటికీ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదు. దీంతో సాగుభూములన్నీ బీడు భూములుగా మారాయి. గ్రామస్తులకు ఉపాధి లేక విసిగిపోయారు. దీంతో ఫ్యాక్టరీకి అమ్మిన భూములను రైతులు సాగు చేసుకొని జీవనం కొనసాగించేందుకు ప్రయత్నించారు. దీంతో 2014 అక్టోబరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్లు, మారణాయుధాలతో సుమారు 200 నుంచి 300 మంది వచ్చి పచ్చని పంటపొలాలను నాశనం చేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులను, మహిళా రైతులను మారణాయుధాలతో గాయపరిచారు. ఆ సమయంలో యలమందనాయక్‌ రైతులకు అండగా నిలబడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీడియా సాక్షిగా ఎండగట్టారు. దీనిని మనసులో పెట్టుకున్న  పోలీసులు, గూండాలతో ఈనెల 2వ తేదీన చెన్నాయపాలెంలోని ఇంట్లో నిద్రిస్తున్న తనను రెండు కార్లలో వచ్చి తీసుకెళ్లిపోయారని బాధితుడు వాపోయాడు. తెలంగాణా మద్యం అక్రమంగా విక్రయిస్తున్నాడంటూ నాగార్జునసాగర్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారని తెలిపారు. అంతేకాకుండా రెంటచింతలలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతోపాటు 26 మందిపై నమోదు చేసిన అక్రమకేసులో కూడా తన పేరును చేర్చారని తెలిపారు.  అప్పట్లో రైతులకు అండగా నిలబడినందుకే కక్షకట్టి అక్రమకేసులు పెట్టి జైలుకు పంపించారని కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. వైసీపీ నాయకుల నుంచి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని టీడీపీ తనకు, తన కుటుంబానికి అండగా ఉండాలని యలమందానాయక్‌ కోరారు.

Updated Date - 2020-11-16T05:10:36+05:30 IST