-
-
Home » Andhra Pradesh » Guntur » Wrong posting leads to file a case
-
యువతిని పోలీసులు సంరక్షిస్తున్న వీడియో వైరల్.. కరోనా పాజిటివ్ అంటూ తప్పుడు పోస్టింగ్స్
ABN , First Publish Date - 2020-03-25T16:28:35+05:30 IST
నరసరావుపేటలోని ప్రకాశ్‌నగర్‌లో ఓ మానసిక దివ్యాంగురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడిపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాలివి...

నరసరావుపేటలో కేసు నమోదు...
పోలీసుల అదుపులో నిందితుడు
గుంటూరు (ఆంధ్రజ్యోతి): నరసరావుపేటలోని ప్రకాశ్‌నగర్‌లో ఓ మానసిక దివ్యాంగురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడిపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాలివి... పట్టణానికి చెందిన ఓ మానసిక వికలాంగురాలు అటు ఇటు తిరుగుతూ ప్రకాశ్‌నగర్ ప్రాంతానికి చేరుకుంది. ఇది గమనించిన ఆ ప్రాంతానికి చెందిన మిట్టపల్లి రమేష్ అనే వ్యక్తి కరోనా అనుమానంతో నరసరావుపేట కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ బి.శివారెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన నరసరావుపేట వన్‌టౌన్ సిఐకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆ బాలికను సంరక్షించి ఆసుపత్రి తీసుకు వెళ్లి పరీక్షలు చేయించారు.
అనంతరం ఆ యువతిని తండ్రికి అప్పగించారు. అయితే ప్రకాశ్ నగర్‌లో ఆ యువతిని పోలీసులు సంరక్షిస్తున్న సమయంలో ఈ మొత్తం దృశ్యాన్ని అదే ప్రాంతానికి చెందిన నందిగామ వంశీ అనే యువకుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు పాజిటివ్ కేసుగా ప్రచారం చేశాడు. ఈ ఘటనపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ విజయరావు మాట్లాడుతూ రూరల్ జిల్లా పరిధిలో కరోన వైరస్‌పై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.