శనగల కొనుగోళ్లు నిలిపివేత
ABN , First Publish Date - 2020-04-08T10:39:18+05:30 IST
జిల్లాలో శనగ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా పేరుతో శనగల కోనుగోళ్లను నిలిపివేశారు. వ్యవసాయ

అమ్ముకోలేక అన్నదాతలకు అగచాట్లు
మార్కెట్ యార్డుల్లో వేల క్వింటాళ్ల నిల్వ
చోద్యం చూస్తున్న మార్క్ఫెడ్
నరసరావుపేట, ఏప్రిల్ 7: జిల్లాలో శనగ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా పేరుతో శనగల కోనుగోళ్లను నిలిపివేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించి రోజులు గడుస్తున్నా ఇంకా జిల్లాలో ఎక్కడా ప్రారంభం కాలేదు. కొనుగోళ్లు చేపట్టాల్సిన మార్క్ఫెడ్ చోద్యం చూస్తుంది. ఈ ఏడాది 39,250 ఎకరాలలో శనగ సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది.
ఎకరాకు 8 క్వింటాళ్ళు సగటు దిగుబడిగా అంచనా వేస్తే ఆ ప్రకారం దాదాపు జిల్లాలో 3,140 మెట్రిక్ టన్నుల శనగలు ఉత్పత్తి అయ్యాయి. మార్కెట్లో ధర పతనమై క్వింటాకు రూ.3 వేలు కూడా రావడంలేదు. దీంతో ప్రభుత్వం క్వింటాకు కనీస మద్దతు ధర రూ.4,875 నిర్ణయించింది. దీంతో యార్డుల్లోని కేంద్రాల్లో శనగలను విక్రయించేందు రైతులు వస్తున్నారు. అయితే ఒక్కో కేంద్రంలో 100 మెట్రిక్ టన్నుల కోనుగోళ్ళకు మాత్రమే మార్క్ఫెడ్ అనుమతులు ఇచ్చింది. ఆపైన అనుమతులు రాకపోవడంతో మార్కెట్ యార్డుల్లో పెద్దఎత్తున నిల్వలు పేరుకు పోయాయి. ఒక్క నరసరావుపేట కేంద్రంలోనే దాదాపు 2 వేల బస్తాల శనగల నిల్వలు ఉన్నాయి.
సిఫార్సులు ఉంటేనే కొనుగోళ్లు
తాము సిఫార్సు చేసిన రైతుల నుంచే కొనుగోళ్లు చేయాలని కేంద్రాల్లోని సిబ్బందికి మార్కెట్ యార్డు చైర్మన్లు హుకుం జారీ చేశారు. రైతులను కూడా పార్టీల వారీగా విభజించేలా వారు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముందు వచ్చిన రైతు వద్ద కొనుగోలు చేయకుండా వారికి ఇష్టం వచ్చిన విధంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో రోజుల తరబడి రైతులు అమ్మకాల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
కొనుగోలు చేస్తాం..
కొనుగోళ్లకు సంబంధించి మార్క్ఫెడ్ ఎండీ నళినీదేవిని మంగళవారం వివరణ కోరగా లాక్ డౌన్ సంబంధం లేదన్నారు. యార్డులలోని కేంద్రాల ద్వారా శనగల కోనుగోలు చేపడతామని చెప్పారు.