ముగిసిన ఎంపిటీసీ, జడ్పీటీసీల నామినేషన్ల ఉపసంహరణలు

ABN , First Publish Date - 2020-03-15T09:57:02+05:30 IST

జిల్లావ్యాప్తంగా 54 జడ్పీటీసీలు, 805 ఎంపీటీసీల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ

ముగిసిన ఎంపిటీసీ, జడ్పీటీసీల నామినేషన్ల ఉపసంహరణలు

గుంటూరు, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా 54 జడ్పీటీసీలు, 805 ఎంపీటీసీల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు శనివారం ఆఖరిరోజు కావడంతో మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద  వివిధ రాజకీయ పార్టీల నేతలు హడావుడి చేశారు. ప్రధానంగా అధికార పార్టీ నేతలు నామినేషన్లు వేసిన ఇతర పార్టీ అభ్యర్థులను సామదాన బేద దండోపాయాలు ఉపయోగించి పోటీ నుంచి తప్పించారు. 

 

జిల్లా వ్యాప్తంగా గురజాల రెవిన్యూ డివిజన్‌లో ఏడు, రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం జడ్పీటీసీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి, దుర్గి, వెల్దుర్తి, మాచర్ల, రెంటచింతలతో పాటు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ ్ల, గురజాల జడ్పీటీసీ కూడా వైసీపీ అభ్యర్థుల మినహా అందరు బరి నుంచి తప్పుకున్నారు. మొత్తం మీద 150 ఎంపీటీసీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.  


జడ్పీలోనే మాచర్ల ఎమ్మెల్యే పీఏ తిష్ట 

మాచర్ల శాసన సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పీఏ శనివారం ఉదయం నుంచే జడ్పీ కార్యాలయంలో తిష్ట వేశారు. జడ్పీ ఉద్యోగిగా ఉన్న అహ్మద్‌ మాచర్ల ఎమ్మెల్యే వద్ద ప్రభుత్వ పీఏగా కొనసాగుతున్నారు. ఉదయం నుంచి ఆ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో నామినేషన్లు దాఖలు చేసిన ఇతర పార్టీల అభ్యర్థులను జడ్పీకి తీసుకువచ్చి ఉపసంహరించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కొంత మంది అభ్యర్థులకు డబ్బు ఆశా చూపారు. మరికొంత మందిని పోలీసులు, నిఘా వర్గాల ద్వారా బెదిరింపుల ప్రక్రియ చేపట్టారు.  


చివరి నిమిషంలో మాచర్ల జనసేన అభ్యర్థి

మాచర్ల జడ్పీటీసీగా రేగులవరం తండాకు చెందిన బాలు నాయక్‌ జనసేన అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. నాయక్‌ హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలియడంతో ప్రత్యేక బృందాన్ని పంపి శనివారం మధ్యాహ్నంకు జడ్పీ కార్యాలయానికి తరించారు. ఉపసంహరణ సమయం ముగిసిన తరువాత నాయక్‌ను శాసన సభ్యుని పీఏ, అతని అనరుచరులు బలవంతంగా లోపలకు తెచ్చారు. రిటర్నింగ్‌ అధికారి సమక్షంలోనే ఉపసంహరణ పత్రంపై సంతకం చేయాలని బెదిరించారు. జనసేన అభ్యర్థి బాలు నాయక్‌ ససేమిరా అంటూ సంతకం చేయలేదు. ఈ తంతు రిటర్నింగ్‌ అధికారి సమక్షంలోనే జరిగింది. కొద్ది సేపటి తరువాత నాయక్‌ బంధువులు బలవంతంగా ఒప్పించి ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించారు. ఎమ్మెల్యే పీఏ నాయక్‌ను దగ్గరుండి బయటకు తెచ్చి ద్విచక్ర వాహనాలపై తరలించారు.  


పిడుగురాళ్ల ఉపసంహరణపై ఎమ్మెల్సీ ఫోన్‌

పిడుగురాళ్ల జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి జంగా వెంకట కోటయ్య నామినేషన్‌ వేశారు. ఈయన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనయుడు. నామినేషన్‌ దాఖలు చేసిన ఇతర పార్టీల అభ్యర్థులతో బేరసారాలు పూర్తి కావడంలో జాప్యం జరిగింది. దీంతో ఉపసంహరణ గడువు పూర్తి అయింది. ఈ దశలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధికారులకు ఫోన్‌ చేసి ఉపసంహరణను పరిశీలించాలని కోరారు. జడ్పీ ఉద్యోగులు ప్రధాన గేటు ద్వారా వస్తే సమస్యలు వస్తాయని, దొడ్డి దారిలో రావాలని సూచించారు. మరో దారిలో పిడుగురాళ్ల జడ్పీటీసీగా నామినేషన్‌ వేసిన ఇతర అభ్యర్థిని లోపలికి తీసుకెళ్లి ఉపసంహరణ తంతును పూర్తి చేశారు.  

భారీగా మోహరించిన పోలీస్‌ బలగాలు

 నగరంపాలెం పోలీస్‌ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జడ్పీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌డీయే పీడీ డాక్టర్‌ యుగందర్‌కుమార్‌లు ఉదయం నుంచి నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు.  


Updated Date - 2020-03-15T09:57:02+05:30 IST