ఆంక్షలతో.. ఆపలేరు

ABN , First Publish Date - 2020-04-14T09:42:04+05:30 IST

ఎవరి ఇళ్లలో వారు ఉంటూ లాక్‌డౌన్‌ ఆంక్షలను పాటిస్తూ పోరాటం చేస్తుంటే పోలీసులు నోటీసులు

ఆంక్షలతో.. ఆపలేరు

పోలీసుల నోటీసుల జారీపై రైతుల ఆగ్రహం

118వ రోజు కొనసాగిన అమరావతి ఆందోళనలు


గుంటూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఎవరి ఇళ్లలో వారు ఉంటూ లాక్‌డౌన్‌ ఆంక్షలను  పాటిస్తూ పోరాటం చేస్తుంటే పోలీసులు నోటీసులు ఇస్తున్నారని.. అయితే ఆంక్షలతో ఆందోళనలు ఆపలేరని రాజధాని రైతులు తెలిపారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు ర్యాలీలు చేస్తుంటే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోని వారు తమకు మాత్రం నోటీసులు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. పాలనంతా అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు సోమవారానికి 118వ రోజుకు చేరాయి.


తుళ్లూరు, పెదపరిమి, వెలగపూడి, రాయపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, యర్రబాలెం, నీరుకొండ, అనంతవరం, నెక్కల్లు, మందడం, ఉద్దండరాయునిపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. రాజధానిపై ప్రభుత్వ తీరు మార్చుకోవాలని అమరావతి వెలుగు పేరిట రాజధాని మహిళలు చేస్తున్న నిరసనలు సోమవారం కూడా జరిగాయి.     


నేడు దళిత జేఏసీనేతల దీక్షలు

అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని దళిత జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో మంగళవారం నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎవరి ఇళ్లలో వారు ఉపవాస దీక్ష చేయనున్నట్లు తెలిపారు.  రాత్రి 7 గంటలకు అంబేద్కర్‌ జీవన జ్యోతి అనే కార్యక్రమం కింద ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి జై బీమ్‌ అనే నినాదాలు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-04-14T09:42:04+05:30 IST