స్ర్పేయర్ల బిల్లులు నిలిపేస్తాం
ABN , First Publish Date - 2020-05-29T09:11:29+05:30 IST
కరోనా నివారణ చర్యల్లో భాగంగా కొనుగోలు చేసిన స్ర్పేయర్ల బిల్లులను నిలిపివేస్తామని జేసీ దినేష్‌కుమార్ తెలిపారు.

ఆంధ్రజ్యోతి కథనంపై జేసీ స్పందన
రూ.4,700 స్ర్పేయర్కు రూ.18,870 బిల్లు
గుంటూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): కరోనా నివారణ చర్యల్లో భాగంగా కొనుగోలు చేసిన స్ర్పేయర్ల బిల్లులను నిలిపివేస్తామని జేసీ దినేష్‌కుమార్ తెలిపారు. ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో గురువారం స్ర్పేయర్ల నిధులు స్వాహా అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై జేసీ స్పందించారు. జిల్లా స్థాయి కమిటీ ఖరారు చేసిన దానికంటే వీటి ధరలను ఎక్కువ ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల్లో వీటి బిల్లులు చెల్లించవద్దని పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులకు ఆదేశాలిస్తున్నట్లు ఫోన్లో జేసీ ఆంధ్రజ్యోతికి తెలిపారు. టెండర్ ప్రక్రియను అనుసరించకుండా అసెంబ్లీంగ్ యూనిట్లను ఎక్కువ ధరకు సరఫరా చేసినట్లు విజిలెన్స్ కమిటీ బహిర్గతం చేసిందన్నారు. ఈ కొనుగోళ్లలో నిధుల స్వాహా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
విజిలెన్స్ కమిటీ పరిశీలన..
ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రత్యేక కథనంతో జిల్లా స్థాయి విజెలెన్స్ మానిటరింగ్ కమిటీ తాడికొండ మండలం లాం గ్రామ పంచాయతీ కార్యాలయంలోని స్ర్పేయర్లను పరిశీలించింది. వీటికి సంబంధించిన రూ.18,870 బిల్లును పరిశీలించారు. తూనికలు కొలతల శాఖ అధికారులు అల్లూరయ్య, డీసీటీవో హరికృష్ణ, సీఎస్‌డీటీ రమేష్, విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ చదలవాడ హరిబాబు తనిఖీల్లో పాల్గొన్నారు. ప్యాకేజీ నిబంధనలు ఉల్లంఘించారని, ఎప్పుడు తయారు చేసింది, పన్నులతో కలిపి ధర, టోల్ ఫ్రీ నెంబరు తదితర వివరాలు ప్యాకింగ్‌లో లేవని విజిలెన్స్ బృందం విలేకర్లకు తెలిపింది.
కొనుగోళ్లలో భారీగా నిధులు స్వాహా
గ్రామ పంచాయతీలకు సరఫరా చేసేందుకు కొనుగోలు చేసిన స్ర్పేయర్లలో భారీగా నిధులు స్వాహా అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని 600 గ్రామా పంచాయతీల క్లస్టర్లకు 900 స్ర్పేయర్లను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో జపాన్‌కు చెందిన మోటర్తో తయారు చేసిని వీటిని ఏపీలో రూ.4,700 చొప్పున అమ్ముతున్నారు. ఈ మేరకు ఆ కంపెనీ వెబ్సైట్లో కూడా ధరలను ప్రదర్శించి ఉన్నారు. వీటిని రూ.18వేల870 చొప్పున గ్రామ పంచాయతీలకు అందజేశారు. గుంటూరు అవుటర్ రింగ్‌రోడ్డులోని ఓ సంస్థ వీటిని గ్రామ పంచాయతీలకు జీఎస్టీలతో కలిపి రూ.18,870కి పంపిణీ చేసినట్లు సమాచారం.