-
-
Home » Andhra Pradesh » Guntur » water
-
పొంచి ఉన్న ప్రమాదం.. ఏలూరు ఘటనతోనైనా..
ABN , First Publish Date - 2020-12-10T05:30:00+05:30 IST
గుంటూరు నగరానికి గుంటూరు చానల్ ద్వారా నీటి సరఫరా అవుతోంది.

కలుషితం.. కాటేస్తే?
గుంటూరు చానల్‌లో పలుచోట్ల మురుగు నీరు కలయిక
కలుషితమవుతున్న తాగునీరు
మొక్కుబడిగా ఫిల్టర్‌బెడ్ల శుభ్రత
ఏళ్ల తరబడి మరమ్మతులుకు నోచని వైనం
ఏలూరు ఘటనతోనైనా కనువిప్పు కలిగేనా.?
ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబరు 10: గుంటూరు నగరానికి గుంటూరు చానల్ ద్వారా నీటి సరఫరా అవుతోంది. కాజా, చినకాకాని, నంబూరు, పెదకాకాని, తక్కెళ్ళపాడు తదితర గ్రామాల్లోని పంట పొలాల్లో మురుగు నీరు గుంటూరు చానల్‌లో చేరుతోంది. దీంతో నీరు కలుషితమై, దుర్వాసన వస్తోంది. నగరంలోని సంజీవయ్యనగర్, వసంతరాయపురం, కొరిటెపాడు, హనుమయ్యనగర్ రోడ్డు, అడవితక్కెళ్ళపాడు రోడ్డు, కాకాని రోడ్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ ఎదుట, సంపత్‌నగర్ ఇలా అనేక ప్రాంతాల్లో పైపు లైన్ల లీకులు ఏర్పడి మురుగు నీరు సరఫరా అవుతోంది. తక్కెళ్ళపాడు హెడ్‌వాటర్ వర్క్స్ వద్ద పూర్తిస్థాయిలో ఫిల్టర్ చేయటం వల్ల నగరానికి ఎటువంటి తాగునీటి ముప్పు ఎదురవలేదు. గంట గంటకు ల్యాబ్‌లో నీటిని పరిశీలిస్తున్నామని హెడ్ వాటర్ ఏఈ బాబర్ తెలిపారు. ఏలూరులో వెలుగుచూసిన ఘటనతోనైనా అధికారులు పూర్తి స్థాయిలో తాగునీటి ప్రక్షాళన చేయాలని నగర వాసులు కోరుతున్నారు.
పొన్నూరు పురపాలక సంఘం పరిధిలోని పాత రక్షిత మంచినీటి పథకం తరచూ పైపులీకులు, మోటార్లు మరమ్మత్తులతో మొరాయిస్తోంది. క్యారుక్యురేటర్ పని చేయడం లేదు. మరమ్మత్తులు చేపట్టిన దాఖలాలు లేవు. ఏలూరు ఘటనతో అప్రమత్తమైన ఇంజనీరింగ్ అధికారులు ముందు జాగ్రత్తగా ఫిల్టర్‌బెడ్‌లు శుభ్రం చేయించారు.
వినుకొండ నియోజకవర్గంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌లు, ఫిల్టర్‌బెడ్లు శుభ్రం చేసిన దాఖలాలు లేవు. దీంతో మంచినీటి పథకాల ద్వారా వచ్చే నీరు ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఎన్‌ఎస్‌పీ కాలువలపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పశువులకు ఆవాసాలుగా మారుతున్నాయి. కొన్ని ఎస్‌ఎస్ ట్యాంక్‌లకు ఎన్‌ఎస్‌పీ కాలువల నుంచి పైపులైన్లు పనిచేయడం లేదు. దీంతో చెరువులు నింపేందుకు పంటకాలువలను వినియోగిస్తున్నారు. ఈ సమయంలో సమీప పొలాల నుంచి వ్యవసాయ, పశువ్యర్థాలతో తాగునీరు కలుషితమవుతోంది.
నాదెండ్ల మండలం గణపవరం రక్షిత నీటిపథకం ఏడాదిగా సక్రమంగా పనిచేయడంలేదు. ఫిల్టర్‌బావులు ఉన్నా మరమ్మతులు చేయకపోవడంతో తాగునీటి చెరువు నుంచే నేరుగా ట్యాంకుల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. దీంతో నీరు వాసన రావడంతోపాటు పాచి, నలకలతోనే సరఫరా అవుతోంది. ఫిల్టర్‌బెడ్ల మరమ్మతుల కోసం రూ.14.5లక్షల అంచనాలు రూపొందించగా నిధులు మంజూరు కాలేదు.

తాడికొండ మండలంలోని పొన్నెకల్లులో చెరువు నుంచి నీటిని ఫిల్టర్ చేయకుండా ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆ నీటి నిత్యావసరాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు.
సత్తెనపల్లి, ముప్పాళ్ళ, నకరికల్లు, రాజుపాలెం మండలాల్లో రక్షిత మంచినీటి చెరువులు పాచిపట్టి, జమ్ముతో నిండి ఉన్నాయి. వాటిని ప్రజలు గృహావసరాలకే వినియోగిస్తున్నారు.
నరసరావుపేట శాంతినగర్ నీటి శుద్ధి ప్లాంట్ నుంచి పట్టణానికి నీటి సరఫరా అవుతోంది. ప్రధాన పైపులైన్‌లపై లీకులు ఏర్పడ్డా అధికారులు చోద్యం చూస్తున్నారు. నీరు భారీగా వృధా అవుతోంది.
చిలకలూరిపేట పట్టణం రూత్‌డైక్‌మెన్ కాలనీ, భావనారుషినగర్ శివారు ప్రాంతాల్లో, యడ్లపాడు, మైదవోలులో నీరు రంగుమారి సరఫరా అవుతోందని ప్రజలు చెబుతున్నారు. వాటర్ ట్యాంకులు, ఫిల్టర్‌బెడ్‌ల క్లీనింగ్ కూడా మొక్కుబడిగా జరుగుతోంది.
