కరోనాపై యుద్ధం

ABN , First Publish Date - 2020-03-25T09:40:10+05:30 IST

జిల్లాలో కరోనా నివారణలో భాగంగా అధికారులు, పారిశుధ్య సిబ్బంది యుద్ధం ప్రకటించారు.

కరోనాపై యుద్ధం

జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య చర్యలు ముమ్మరం

గుంటూరు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్‌


 ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌ , మార్చి 23 : జిల్లాలో కరోనా నివారణలో భాగంగా అధికారులు, పారిశుధ్య సిబ్బంది యుద్ధం ప్రకటించారు. గ్రామాలలోనూ, పట్టణాలలోనూ వీధి వీధి శుభ్ర పరుస్తూ,  హైపో క్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేస్తూ, బ్లీచింగ్‌ విస్తృతంగా చల్లుతున్నారు. గుంటూరు నగరంలోని నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మంగళవారం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పది పెద్ద ట్యాంకర్ల ద్వారా  పిచికారి చేశారు.


తూర్పు నియోజకవర్గ పరిధిలోని రైల్వేస్టేషన్‌, మంగళదాస్‌నగర్‌, ఏటుకూరు రోడ్డు,చాకలికుంట లాంచెస్టర్‌ రోడ్డు, ఏసీ కాలేజీ, ఉమెన్స్‌ కాలేజీ, వెన్‌లాక్‌ మార్కెట్‌, గాంధీపార్కు, విజ్ఞాన మందిరం రోడ్డు, మాయాబజారు, బస్టాండ్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి నందివెలుగు రోడ్డు వరకు పిచికారి చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మిపురం మెయిన్‌ రోడ్డు, రింగురోడ్డు, కలెక్టర్‌ ఆఫీసు రోడ్డు, బ్రాడీపేట, జిటి రోడ్డు, నల్లచెరువు, నగరంపాలెం, శంకర్‌విలాస్‌, కొరిటెపాడు, నాయుడుపేట, ముత్యాలరెడ్డినగర్‌, అమరావతి రోడ్డు ఆయా ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పెద్ద ట్యాంకులలో కలిపి పిచికారి చేశారు. ఏటుకూరు, బుడంపాడు, స్వర్ణభారతీనగర్‌, పెదపలకలూరులలో కూడా ద్రావణాన్ని పిచికారి చేసినట్లు కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. 


తాడేపల్లి మండలంలోని పలు గ్రామాలలో  పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మండల అధికారుల నేతృత్వంలో ఆయా గ్రామ పంచాయితీల కార్యదర్శులు సంబంధిత పంచాయితీలలొ పారిశుధ్య సిబ్బందిచే పారిశుధ్య నిర్వహణ విధులు నిర్వహింపజేస్తున్నార.  ఆరోగ్య సిబ్బంది ఆయా గ్రామాలలో పలు ఇళ్లవద్దకు వెళ్లి, పలువురి ఆరోగ్య వివరాలు సేకరించి నమోదు చేసుకుంటున్నారు. 


పెదవడ్లపూడి మండలంలోని గ్రామాలలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతున్నామని మండల అభివృద్ధి అధికారి ఏ సుధాకర్‌ తెలిపారు. 


తెనాలిలో మున్సిపల్‌ సిబ్బంది మంగళవారం సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు.మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.వి.రమణ నేతృత్వంలో సిబ్బంది మార్కెట్‌ ఏరియా, గాడిబావి సెంటర్‌, మెయిన్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో ద్రావణాన్ని పిచికారి చేశారు.ట్రాక్టర్లతో, స్ర్పేయర్లతో మురికివాడల్లో మందును పిచికారి చేయించారు.


వట్టిచెరుకూరు మండల పరిధిలోని గ్రామాల్లో  గ్రామ సచివాలయ సెక్రటరి అప్పారావు ప్రధాన వీధులతో పాటు సైడు కాల్వల్లో బ్లీచింగ్‌ను చల్లించారు. 

Read more