-
-
Home » Andhra Pradesh » Guntur » vehicles on road will be penalised
-
మంగళవారం నుంచి.. కఠిన చర్యలు!
ABN , First Publish Date - 2020-03-24T10:02:06+05:30 IST
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో..

- కనిపిస్తే... కేసులే
- ఇళ్ల నుంచి రావద్దని హెచ్చరికలు
- నేటి నుంచి కఠినంగా 144 సెక్షన్ అమలు
- రోడ్డుపైకి వస్తే ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్ల సీజ్
- నిత్యావసర దుకాణాలు తప్ప మిగతావన్నీ మూయాల్సిందే
- సోమవారం సాయంత్రం నుంచే గుంటూరులో ఆంక్షలు ప్రారంభం
గుంటూరు, మార్చి 23: కలకలం సృష్టిస్తోన్న కరోనాతో జిల్లా షట్‌డౌన్‌లోకి వెళ్లింది. ఆదివారం జనతా కర్ఫ్యూకు అందరూ జై కొట్టారు. అయితే ఆ స్ఫూర్తిని మరిచారు. కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా విచక్షణ మరిచి.. విచ్చలవిడిగా సోమవారం రోడ్లపైకి జనం వచ్చారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నా.. అధికారులు హెచ్చరికలు బేఖాతర్ చేస్తూ రోడ్లపై జనసంచారం సర్వ సాధారణంగా కనిపించింది. మొదట పట్టించుకోని పోలీసులు సాయంత్రానికి రంగంలోకి దిగారు. నిషేధాజ్ఞలు పటిష్టంగా అమలు చేశారు. మంగళవారం నుంచి అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నట్లు ప్రకటించారు. పలు ఆంక్షలు విధించి నిత్యావసరాల దుకాణాలకు మాత్రమే అనుమతించారు. మంగళవారం నుంచి ఆంక్షలు మీరితే సహించమని, చర్యలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు.
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కట్టడి చర్యలను తీవ్రతరం చేసింది. మంగళవారం నుంచి అనవసరంగా ఎవరైనా రోడ్డు కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించి ఎక్కడికక్కడ ఆంక్షలు విధించింది. 144వ సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే సోమవారం గుంటూరుతో పాటు పలు ప్రాంతాల్లో ఎక్కడా ఆంక్షలు అమలు కాలేదు. దుకాణాలు యథావిధిగా తెరుచుకోగా, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రజలు షరామామూలుగా రాకపోకలు సాగించారు. ఒక వైపు కరోనా విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ఆంక్షలు అమలు కాకపోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని, అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకోవాలని సోమవారం మధ్యాహ్నం సౌత్‌కోస్టల్ జోన్ ఐజీ ప్రభాకరరావు ఆదేశించారు. ప్రస్తుతం నెలకున్న పరిస్థితిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు తక్షణం స్పందించి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి పోలీసులు తమ స్టేషన్ల పరిధిలో కఠినవైఖరి అవలంభించారు. ఎక్కడికక్కడ దుకాణాలను మూయించారు. ఆటోలను సీజ్ చేశారు. గుంటూరులో సుమారు 50 ఆటోలను సీజ్ చేసి పరేడ్‌గ్రౌండ్‌కు తరలించారు. ద్విచక్ర వాహనచోదకులు, కార్లు, ఇతర వాహనాలను సైతం ఆపి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మంగళవారం నుంచి అకారణంగా, చిన్న చిన్న పనులకు రోడ్ల మీదకు వస్తే కేసులు నమోదు చేయడమే కాక వాహనాలను సైతం సీజ్ చేస్తామని హెచ్చరించారు.
గుంటూరులోకి నో ఎంట్రీ
సోమవారం సాయంత్రం నుంచి గుంటూరు నగరంలోకి గ్రామీణ, ఇతర జిల్లాల నుంచి కార్లు, బస్సులు వంటి పెద్ద వాహనాలను అనుమతించలేదు. నగర శివార్లలో పోలీసులు ఆయా వాహనాలను ఆపారు. ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. జిల్లాలోని వివిధ పట్టణాలు, జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో వాహన రాకపోకలను కట్టడికి శాశ్విత బారికేడ్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే తప్ప సాధారణ రోగాలకు సైతం ఆసుపత్రులకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం నుంచి రోడ్డు మీద కనిపించే ప్రతి వాహనాన్ని నిలిపివేయడమే గాక పూర్తిస్థాయిలో విచారించి అత్యవసర పరిస్థితి అని తేలితేనే వదులుతామన్నారు.
దుకాణాలు తెరిస్తే సీజ్
మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా నిత్యవసర సరుకుల దుకాణాలు తప్ప మిగిలిన వ్యాపార సంస్ధలన్నింటిని మూసి వేయాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు. మెడికల్ షాపులు, పాలు, కూరగాయలు, ఇతర నిత్యవసర సరుకుల దుకాణాలు తప్ప ఎటువంటి వ్యాపార వాణిజ్యసంస్థలు తెరవడానికి వీల్లేదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా దుకాణాలు తెరిస్తే భారీ మొత్తంలో జరిమానా విధించడంతో పాటు సీజ్ చేస్తామని అంతేకాక క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
రాకపోకల నిషేధం: ఐజీ ప్రభాకరరావు
గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రోడ్లపై మంగళవారం నుంచి వాహన రాకపోకలను నిషేధించినట్లు సౌత్‌కోస్టల్ జోన్ ఐజీ ప్రభాకరరావు తెలిపారు. మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ నిషేధాజ్ఞలను కఠినంగా అమలు చేయాలని అర్బన్ పోలీసు అధికారి, డీఐజీ పిహెచ్‌డి రామకృష్ణ, రూరల్ ఎస్పీ విజయరావు ఆదేశించారు. మంగళవారం నుంచి రోడ్ల మీదకు వాహనాలు వస్తే సీజ్ చేస్తామని ట్రాఫిక్ డీఎస్పీ రమణకుమార్ హెచ్చరించారు. వైద్యసేవలు, నిత్యవసర వస్తువుల వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. నగర పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు పికెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నిత్యావసరాల వాహనాలకే అనుమతి: రూరల్ ఎస్పీ విజయరావు ఆదేశాలు
లాక్‌డౌన్‌లో భాగంగా మంగళవారం నుంచి రూరల్ జిల్లా పరిధిలో వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు. సోమవారం ఆయన జిల్లాలోని పోలీసు అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను పూర్తిగా కట్టడి చేయాలని తెలిపారు. నిత్యవసర వస్తువులను మాత్రమే అంతరాష్ట్ర, అంతర్ జిల్లాల మధ్య రవాణాకు అనుమతి ఇవ్వాలన్నారు. ప్రధాన కూడళ్ళు, జంక్షన్‌లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఆయా వాహనాలను తనిఖీ చేయడంతోపాటు ప్రతి ప్రయాణికుడితో మాట్లాడి ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నారో విచారించాలన్నారు.
అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్ళేవారిని, ఎక్కువ కాలం నిల్వ ఉండని ఆహార పదార్థాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. ప్రైవేటు ఉద్యోగులను బయట తిరగనివ్వరాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను తనిఖీ చేసిన తరువాత మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. వాహన చోదకులు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. నిత్యావసర సరుకులను వ్యాపారులు బ్లాక్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో కరోనా వైరస్‌పై తప్పుడు పోస్టింగ్స్ పెడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తప్పని సరి అయితేనే రోడ్డు మీదకు రండి : అర్బన్ పోలీసు అధికారి రామకృష్ణ
ప్రజలు తప్పనిసరి అయితేనే రోడ్డు మీదకు రావాలని, లేదంటే ఇళ్ళకే పరిమితం కావాలని అర్బన్ పోలీసు అధికారి, డీఐజీ రామకృష్ణ తెలిపారు. జిల్లాలో 144వ సెక్షన్ అమల్లో ఉన్నందున నిత్యవసర దుకాణాలు, మెడికల్ షాపులు, పాల విక్రయాలకు మాత్రమే అవకాశాలు ఉంటాయన్నారు. నిత్యావసర సరుకుల కోసం ఇంట్లో ఒకరు మాత్రమే బయటకు రావాలన్నారు. వారు కూడా సాధ్యమైనంత త్వరగా ఇళ్ళకు చేరుకోవాలన్నారు. అకారణంగా వాహనాలపై రోడ్ల మీదకు వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలన్నారు. నిత్యవసర దుకాణాలు సైతం రాత్రి 8 గంటలకు మూసివేయాలన్నారు. ఆటోలు, కార్లు నడపరాదని, ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే ప్రయాణించాలన్నారు. నాలుగు చక్రాల వాహనాల్లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదన్నారు.