ఎకరా కోతకు..రూ.10 వేలు

ABN , First Publish Date - 2020-12-12T05:22:28+05:30 IST

ఖరీఫ్‌ వరి సాగు చేసిన రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెమటోడ్చి పండించిన పంట ప్రకృతి ప్రకోపానికి చాపలా నేలవాలింది.

ఎకరా కోతకు..రూ.10 వేలు
భట్టిప్రోలులో కుప్ప వేస్తున్న కూలీలు

కూలి రేట్లతో అన్నదాతల బెంబేలు 

పెరుగుతున్న కూలీల ఖర్చులు..  దిగజారిన దిగుబడులు


భట్టిప్రోలు,  డిసెంబరు 11: ఖరీఫ్‌ వరి సాగు చేసిన రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చెమటోడ్చి పండించిన పంట ప్రకృతి ప్రకోపానికి చాపలా నేలవాలింది. నేలవాలిన, నీట మునిగిన పంటలో కొంత పంటను అష్టకష్టాలు పడి దక్కించుకున్నారు. ఆ పంటను అమ్ముకుని కొంతవరకైనా నష్టాల నుంచి గట్టెక్కాలను కుంటున్న రైతులను కూలి రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. నేల వాలిన పంటను కోత కోసేందుకు గతంలో రూ.4 వేలు అయ్యేది. అయితే ప్రస్తుతం ఆ కూలి రూ.9 వేల నుంచి రూ.10 వేలకు పెరిగిపోయింది. పెరుగుతున్న కూలీల ఖర్చులు ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా.. తగ్గిన దిగుబడులు వరి రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి.  గింజపాలు పోసుకునే దశలో కురిసిన భారీ వర్షాలు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. 35 నుంచి 40 బస్తాలు దిగుబడి రావాల్సిన పొలాల్లో కూడా 25 బస్తాలకు మించి రావడం లేదు.  సాగు కోసం పెట్టిన పెట్టుబడికి అదనంగా కోత, ఓదెలు ఆరబెట్టడం, కుప్పలు వేసినందుకు ఎకరాకు రూ.18 నుంచి రూ.20 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నదాతలు వాపోతున్నారు. యాంత్రిక వ్యవసాయం వల్ల ఖర్చు తగ్గే అవకాశం ఉన్నా పొలాలు బురదగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూలీలపైనే ఆధారపడాల్సి వస్తోంది.  రెండో పంటగా మినుము, పెసర సాగు చేసిన పొలాల్లో ఎంత ఖర్చు అయినా కూలీలతో కోత కోయిస్తున్నామని వరి రైతులు తెలిపారు. వర్షాలతో పంట దెబ్బతినడంతో ఇదే అవకాశంగా దళారులు ఇష్టం వచ్చిన రేటు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. వారం క్రితం 75 కిలోల బస్తా రూ.1200లకు కొనుగోలు చేసిన దళారులు ప్రస్తుతం రూ.1150 అంటు న్నారని రైతులు తెలిపారు.  


Updated Date - 2020-12-12T05:22:28+05:30 IST