వెలగపూడి ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-12-28T06:35:09+05:30 IST

తుళ్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో ఆర్చి ఏర్పాటు విషయమై రెండువర్గాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒక మహిళ మృతిచెందగా పలువురు గాయపడ్డారు.

వెలగపూడి ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత
వెలగపూడి ఎస్సీ కాలనీలో పోలీసులు

రెండు వర్గాల మధ్య ఘర్షణ... మహిళ మృతి

పలువురికి గాయాలు


తుళ్లూరు, డిసెంబరు 27:  తుళ్లూరు మండలం వెలగపూడి ఎస్సీ కాలనీలో ఆర్చి ఏర్పాటు విషయమై రెండువర్గాల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఒక మహిళ మృతిచెందగా పలువురు గాయపడ్డారు. కాలనీలో ఆర్చి నిర్మాణ విషయంలో ఎస్సీల్లోని రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకవర్గం వారు రాళ్లు రువ్వడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఉద్రిక్తతను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడినవారిని అంబులెన్స్‌లో హాస్పటల్‌కు తరలించారు. రాళ్లదాడిలో తీవ్రంగా గాయపడిన మెండెం మరియమ్మ అలియాస్‌ బుజ్జి మృతిచెందింది. తుళ్లూరు డీఎస్పీ జె.శ్రీనివాసరావు, సీఐ ధర్మేంద్రబాబు  బందోబస్తు ఏర్పాటుచేసి, ఇరువర్గాల వారికి సర్ది చెప్పారు. అపోహాలకు, అనుమానాలకు పోవద్దని ఎస్సీ కాలనీ ప్రజలకు చెప్పారు.  ఆవేశాలకు లోను కావద్దని సూచించారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు మీడియాకు చెప్పారు. ఇరు వర్గాల వారు ఓర్పుతో ఉండాలని చెప్పామని, వారు విన్నారని పేర్కొన్నారు. విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


బాపట్ల ఎంపీ సురేష్‌పై ఆరోపణలు

ఆదివారం ఉదయం వెలగపూడి ఎస్సీలలోని ఒకవర్గం వారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను కలిసి ఆర్చి విషయమై మాట్లాడగా... ‘నేనున్నాను వివాదాస్పదమైనా చూసుకుంటాను’ అని భరోసా ఇచ్చారని గాయపడినవారు ఆరోపించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌లు  తమ సామాజికవర్గం వారికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి ఓట్లు వేస్తే తగిన బహుమానా ఇది అని వారు ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం జగన్‌ ఎంపీ సురేష్‌పై  తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. 

Updated Date - 2020-12-28T06:35:09+05:30 IST