గడ్డుకాలం!

ABN , First Publish Date - 2020-03-28T11:15:39+05:30 IST

కరోనా మహమ్మారి బడుగు జీవులపాలిట శాపంగా మారింది. పనులు లేవు.. లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో తెలియక పోవడంతో అప్పు ఇచ్చే...

గడ్డుకాలం!

  • బడుగు జీవి విలవిల
  • పని లేదు.. అప్పు ఇచ్చే నాథుడు లేడు..

గుంటూరు(సంగడిగుంట), మార్చి 27: కరోనా మహమ్మారి బడుగు జీవులపాలిట శాపంగా మారింది. పనులు లేవు.. లాక్‌డౌన్‌ ఎప్పుడు ముగుస్తుందో తెలియక పోవడంతో అప్పు ఇచ్చే నాథుడు కూడా లేడు. గతంలో గుంటూరులో పని లేకపోతే బెంగళూరు, హైదరాబాద్‌ వెళ్లారు. కానీ ఇప్పుడు దేశమంతట ఒక్కటే పరిస్థితి. దీంతో బడుగు జీవి దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయాడు. వేతన జీవిది అదే పరిస్థితి... ప్రైవేటు కంపెనీలు ఎంత వరకు వేతనాలు ఇస్తాయో తెలియడం లేదు. పని లేదని వేతనాలు నిలిపివేస్తారేమోన్న ఆందోళనలో మధ్యతరగతి జీవి ఉన్నాడు. ఇంకా నెలలు ఎలా గడుస్తాయో అర్థం కాని పరిస్థితి...!

 

నిత్యావసర ధరలు పైపైకి..

మరోవైపు లాక్‌డౌన్‌ పేరుతో వ్యాపారులు ధరలు పెంచడం ప్రారంభించారు. శుక్రవారం గుంటూరు మార్కెట్‌లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు బియ్యంతో సహా అన్నింటికి 20 శాతం ధరలు పెంచి అమ్మారు. గుంటూరు మార్కెట్‌లో అన్ని రకాల నిత్యావసర వస్తువులు 20 రోజుల వరకు నిల్వలు ఉంటాయి. కానీ మూడు రోజులకే ధరలు పెంచడం మాత్రం వ్యాపారుల అత్యాశే కారణం. బయట నుంచి లారీలు రావడం లేదని చెబుతున్నారు. మిల్లర్లే ధరలు పెంచేశారని, వారిపై నెట్టేస్తున్నారు. కందిపప్పు వారం రోజుల క్రితం రూ.75 ఉండగా శుక్రవారం రూ.100కు అమ్మారు.. నూనె కూడా రూ.15 పెంచారు. వినియోగదారులు షాపుల వద్దకు వెళ్లినప్పుడు ఎక్కువమంది గుమిగూడటంతో దానిని ఆధారంగా చేసుకొని చెప్పిందే రేటుగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు వస్తున్నారు కానివ్వండి అంటూ తొందర చేయడంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. 


నియంత్రణ ఎక్కడ..?

ప్రభుత్వం, అధికారులు నియంత్రణ అని చెబుతున్నప్పటికీ వాస్తవం ఎక్కడా కనపడటం లేదు. కొన్ని గంటలే సమయం ఉండటంతో ప్రజలు ఆలోచించే పరిస్థితి కూడా లేదు. వస్తువు దొరికిందా లేదా అన్న పరిస్థితిలోనే ఉంటున్నారు. వాస్తవానికి ఒంటి గంట వరకు సమయం ఉంటుందని, ప్రభుత్వం చెప్పినా గుంటూరులో 9 గంటల నుంచే పోలీసులు మూయించారు. దీంతో వ్యాపారులకు కూడా ఏం అర్థం కాలేదు.  


Updated Date - 2020-03-28T11:15:39+05:30 IST