వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి : జీవీ ఆంజనేయులు

ABN , First Publish Date - 2020-03-15T09:52:31+05:30 IST

ఎన్నికలంటే సీఎం జగన్‌ గజగజ వణుకుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ

వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి : జీవీ ఆంజనేయులు

గుంటూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి) : ఎన్నికలంటే సీఎం జగన్‌ గజగజ వణుకుతున్నారని టీడీపీ  జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించా రు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. టీడీపీ అభ్యర్ధుల నుంచి నామినేషన్‌ పత్రాలను లాక్కొని వైసీపీ నేతలు పోలీసుల ఎదుటే చించుతున్నారని... ఈ సంబడానికి ఎన్నికలు ఎందుకని మండిపడ్డారు. రాష్ట్రంలోని పరిస్థితులు చూస్తుంటే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆత్మ ఘోషిస్తోందన్నారు.


రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించటం ఎందుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవీ నిలదీశారు. ఆధారాలతో సహా చూపిస్తుంటే ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇదే విధానాన్ని గతంలో తాము అనుసరిస్తే జగన్‌ సీఎం కాదు కదా... కనీసం ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదన్నారు. అరాచకాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా గవర్నర్‌ స్పందించడం లేదని విమర్శించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన డీజీపీ వైసీపీ తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక అందుబాటులోకి రావాలన్నా, పెట్రోలు ఉత్పత్తుల ధరలు తగ్గాలన్నా, సంక్షేమం కొనసాగాలన్నా స్థానిక ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ అభ్యర్ధులను బలపరచాలని కోరారు.


ఈ ఎన్నికల్లో గుంటూరు మేయర్‌తో సహా అన్ని సీట్లలో విజయం సాధిస్తామని జీవీ ఆంజనేయులు తెలిపారు. జిల్లాలో 89 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే  పరిస్థితులు ఉన్నాయా అంటూ టీడీపీ సీనియర్‌ నేత మన్నవ సుబ్బారావు ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. సమావేశంలో నేతలు చిట్టాబత్తిని చిట్టిబాబు, లాల్‌ వజీర్‌, గంగాధర్‌, కంచర్ల శివరామయ్య, గోళ్ల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-15T09:52:31+05:30 IST