శీతల గిడ్డంగుల వద్ద మిర్చి లారీల రద్దీ

ABN , First Publish Date - 2020-03-25T09:37:41+05:30 IST

దేశంలోనే మిర్చి లావాదేవీలు అధికంగా జరిగే గుంటూరు మిర్చియార్డుని కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మూసివేయడంతో రైతులు తమ వద్ద ఉన్న మిరపకాయలను శీతలగిడ్డంగుల్లో నిల్వ చేసుకొంటున్నారు.

శీతల గిడ్డంగుల వద్ద మిర్చి లారీల రద్దీ

మిర్చియార్డు మూసివేతతో అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌

నిల్వ చార్జీలు పెరగకుండా కట్టడి చేయాలి

సరుకుని స్టోరేజ్‌లకు తరలించేందుకు ఆంక్షలు సడలించాలి


గుంటూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మిర్చి లావాదేవీలు అధికంగా జరిగే గుంటూరు మిర్చియార్డుని కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మూసివేయడంతో రైతులు తమ వద్ద ఉన్న మిరపకాయలను శీతలగిడ్డంగుల్లో నిల్వ చేసుకొంటున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రతీ ఒక్క కోల్డ్‌స్టోరేజ్‌ వద్ద మిర్చి టిక్కీలు నింపిన లారీలను రైతులు తీసుకొచ్చారు. యార్డులో తిరిగి అమ్మకాలు, కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొన్న దృష్ట్యా రైతులు ఈ మార్గాన్ని ఎంచుకొన్నారు.


అయితే మంగళవారం ఉదయం నుంచి పోలీసు ఆంక్షలు కారణంగా కోల్డ్‌స్టోరేజ్‌ల వద్దకు తీసుకొస్తున్న లారీలు మార్గమధ్యలోనే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న సరుకుని శీతల గిడ్డంగులకు తరలించేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని మిర్చి రైతులు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు. 


సోమవారం వరకు మిర్చి ట్రేడింగ్‌ జరుగుతుండటంతో ఏ రోజు సరుకు ఆ రోజు ఎక్స్‌పోర్టుకు వెళుతూ వచ్చింది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మిర్చియార్డుని తప్పక మూసేయాల్సి వచ్చింది. దీంతో రైతులు తమ వద్ద ఉన్న మిర్చి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వచేసేందుకు నిర్ణయించారు. 


గుంటూరు యార్డు పరిధిలో మొత్తం 87 కోల్డ్‌స్టోరేజ్‌లు ఉండగా వీటిల్లో 77మాత్రమే ఫంక్షనల్‌లో ఉన్నట్లు వ్యాపారస్థులు చెబుతున్నారు. ప్రస్తుతానికి 12 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వలు వీటిల్లో ఉన్నాయి. మరో 20 లక్షల క్వింటాళ్లు (50 లక్షల టిక్కీలు) నిల్వ చేసుకొనేందుకు ఖాళీ ఉన్నది. అయితే రైతులు తమ మిర్చిని కల్లాలనుంచి తెచ్చుకొనేందుకు పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. సోమవారం రాత్రికి ట్రాక్టర్లు, లారీల్లో తీసుకొచ్చిన మిర్చిని నగరంలోని కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వచేశారు. 


మరోవైపు పొలాల్లో మిర్చిని కోసేందుకు కూలీలను కూడా పోలీనులు రానివ్వడం లేదని రైతులు వాపోతున్నారు. దీని వలన కూడా తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి దేశమంతా లాక్‌డౌన్‌ని ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన దృష్ట్యా మిర్చి రైతులకు కొన్ని ఆంక్షలు సడలించాలని, లేకపోతే వారు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రస్తుతానికి కోల్డ్‌స్టోరేజ్‌లలో టిక్కీకి రూ. 165 నుంచి రూ.190 వరకు నిల్వ చార్జీలు వసూలు చేస్తున్నారు.


ఆ ధరలు పెరగకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అలానే నిత్యవసర సరుకుల లారీలు/ట్రాక్టర్లు/ఆటోలకు ఎలాగైతే అనుమతిస్తున్నారు అలానే మిర్చి వాహనాలకు కూడా కోల్డ్‌స్టోరేజ్‌ల వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతున్నారు. ఇదిలావుంటే యార్డులో నిల్వ ఉన్న మిర్చి టిక్కీలలో మంగళవారం 50 వేల టిక్కీలకు పైగా సరుకుని కోల్డ్‌స్టోరేజ్‌లకు తరలించారు. మిగతా సరుకుని కూడా బుధ, గురువారాల్లో తరలించేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-03-25T09:37:41+05:30 IST