కరోనా.. పంజా

ABN , First Publish Date - 2020-04-15T09:33:59+05:30 IST

జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గుంటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా కేసులు

కరోనా.. పంజా

జిల్లాలో 114 కేసులు

ఒక్క రోజే 21 మందికి పాజిటివ్‌

గుంటూరులోనే 12 మందికి నిర్ధారణ

దాచేపల్లిలో ఐదుగురికి, నరసరావుపేటలో హోంగార్డుకు

గుంటూరు నల్లచెరువు, కర్లపాలెం మండలంలోనూ వైరస్‌

జిల్లాలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరిందన్న కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌


గుంటూరు, దాచేపల్లి, ఏప్రిల్‌ 14: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గుంటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. మంగళవారం ఒక్క రోజే 21 కేసులు వెలుగుచూశాయి. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 114కు చేరాయి. ఇప్పటికి కరోనాతో జిల్లాలో ఐదుగురు మృతి చెందినట్లు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ మంగళవారం ధ్రువీకరించారు. మృతుల్లో ముగ్గురు గుంటూరు నగరానికి చెందిన వారు కాగా ఒకరు నరసరావుపేట, మరొకరు దాచేపల్లికి చెందిన వారు ఉన్నారన్నారు.


మంగళవారం గుంటూరు ఆనందపేట, కుమ్మరబజారు, సంగడిగుంట, దాచేపల్లి నారాయణపురం, నరసరావుపేటలో కేసులు వెలుగుచూశాయి. కొత్తగా గుంటూరు నల్లచెరువు, కర్లపాలెం మండలం దుండివారిపాలెం పంచాయతీ శ్రీరామ్‌నగర్‌లో పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. మరో కేసు విజయవాడ వాసి మంగళగిరిలో ఉంటూ కరోనా బారిన పడ్డారు. అయితే దీనిని గుంటూరు జిల్లాలో చూపిస్తున్నారు. దీంతో కలిపి మొత్తం 114 కేసులుగా నమోదు అయ్యాయి. 

 

దాచేపల్లిలో ఇంటింటా వైద్య పరీక్షలు

దాచేపల్లి నగర పంచాయతీలోని ఆదర్శ పాఠశాలలోని క్వారంటైన్‌లో ఉన్న 16 మందిలో ఐదుగురికి కరోనా పాజిలివ్‌గా మంగళవారం అధికారులు నిర్ధారించారు.  కరోనా ఇటీవల మృతి చెందిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేసిన వైద్యుడితో పాటు, ఓ ఎలక్ర్టీషియన్‌, ఇద్దరు కుమారులు, మరో వ్యక్తికి పాజిటివ్‌గా గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. పాజిటివ్‌ కేసులు నమోదైన వారంతా దాచేపల్లి ఆర్‌అండ్‌బీ సెంటర్‌ నారాయణపురానికి చెందిన వారే. వీరందరినీ ప్రత్యేక వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


దీంతో అప్రమత్తమైన అధికారులు నారాయణపురానికి చెందిన 52 మందిని ప్రైమరీగా, మరో 130 మందిని సెకండరీగా గుర్తించారు. గుర్తించిన వారికి స్థానికంగా రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అధికారులు నారాయణపురంలో ఇంటింటా ఆరోగ్య సర్వే చేపట్టారు.  తహసీల్దారు గర్నపూడి లేవి, కమిషనర్‌ రామారావు ప్రజలను అప్రమత్తం చేశారు.

Updated Date - 2020-04-15T09:33:59+05:30 IST