నాకు కరోనా వచ్చింది.. ఫోన్‌లో టచ్‌లో ఉంటా : తెనాలి ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-07-19T18:05:09+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ విస్తరిస్తోంది.

నాకు కరోనా వచ్చింది.. ఫోన్‌లో టచ్‌లో ఉంటా : తెనాలి ఎమ్మెల్యే

గుంటూరు : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసిన ఈ వైరస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. తీవ్ర భయాందోళన మధ్య రాష్ట్ర ప్రజలు జీవనం సాగిస్తున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, పోలీసులు ఇలా ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీ నేతలను కరోనా వణికిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, వారి కుటుంబీకులు, భద్రతా సిబ్బందికి కరోనా సోకింది.


తెనాలి ఎమ్మెల్యేకు కరోనా

తాజాగా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కరోనా సోకిందని నిర్ధారణ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం ఆయన రిజల్ట్ రాగా పాజిటివ్ అని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తెనాలిలో ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, పలువురు వైద్య, పోలీసు సిబ్బంది కరోనా బారినపడ్డారు. కొద్ది రోజుల క్రితమే కరోనాతో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ మృతి చెందడంతో తెనాలిలో భయాందోళనలు నెలకొన్నాయి.


ఆందోళన చెందొద్దు.. ఫోన్‌లో టచ్‌లో ఉంటా

శివకుమార్‌కు కరోనా సోకిందని తెలుసుకున్న బంధవులు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన అభిమానుల కోసం వీడియో సందేశం పంపారు. నాకు  పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రజలు ఎవ్వరూ కంగారు ఆందోళన చెందవద్దు. ప్రజలకు నిత్యం ఫోన్‌లో అందుబాటులో ఉంటాను. దయచేసి ప్రజలు ఎవ్వరూ పని లేకుండా ఇళ్ళ నుంచి బయటకు రావొద్దు. కరోనా పట్ల అశ్రద్ద వద్దు అని శివకుమార్ వీడియో సందేశం పంపారు. కరోనా నుంచి ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Updated Date - 2020-07-19T18:05:09+05:30 IST