గుంటూరు జిల్లాలో.. ‘టెన్‌’షన్‌!

ABN , First Publish Date - 2020-04-05T09:11:06+05:30 IST

కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది...

గుంటూరు జిల్లాలో.. ‘టెన్‌’షన్‌!

ఒకే రోజులో పది కరోనా పాజిటివ్‌ కేసులు

ఒకే కుటుంబంలో ఐదుగురికి...

జిల్లాలో 30కు చేరిన కేసుల సంఖ్య

అర్బన్‌లో 19... రూరల్‌లో 11

వన్‌టౌన్‌లో పెరుగుతున్న రెడ్‌ జోన్లు

ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ పరీక్షకు పంపిన నమూనాల సంఖ్య 428

కరోనా నెగటివ్‌ నిర్ధారణ అయినవి 326

కరోనా పాజిటివ్‌ కేసులు 30

రిజల్ట్‌ రావలసిన కేసులు 72

ఐసోలేషన్‌లో ఉన్నవారు 332

ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినవారు 96

గృహనిర్బంధంలో ఉన్నవారు 1249

క్వారంటైన్‌ కేంద్రాలు 68

క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నవారు 450

 

గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది... గుంటూరు జిల్లావాసులను కలవరపెడుతోంది... ఒకే రోజు ఏకంగా పది పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 20 కేసులు ఉండగా.. అది శనివారం 30కి చేరింది. పాత గుంటూరులో ఒకే కుటుంబంలో ఐదు కేసులు నమోదయ్యాయి. గుంటూరు వన్‌టౌన్‌ కేంద్రంగా కేసులు విస్తృతం అవుతుండటం అధికార వర్గాలను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో ఆంక్షలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నట్లు రేంజ్‌ ఐజీ ప్రభాకరరావు స్పష్టం చేశారు.


నగరంలోని వన్‌టౌన్‌ను కరోనా వైరస్‌ వెంటాడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 20 పాజిటివ్‌ ఉండగా శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మరో 10 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో 30కు కరోన పాజిటివ్‌ కేసులు చేరాయి. తాజాగా పాతగుంటూరులోని నందివెలుగు రోడ్డులో గల కుమ్మరిబజారులో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా వైరస్‌ సోకింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి కరోన పాజిటివ్‌ రాగా అతని ద్వారా అతని కోడలు, ఇరువురు మనవళ్లు, మనవరాళ్లకు వైరస్‌ బయటపడింది. వీరిందరిని క్వారంటైన్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


అదేవిధంగా యూపీ నుంచి నగరానికి వచ్చిన ఓ యువకుడికి లక్షణాలు ఉండటంతో ఆసుపత్రికి తరలించగా ఆయనకు పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. ఆటోనగర్‌, బుచ్చయ్యతోట, వేజండ్ల ప్రాంతాలకు చెందిన వారికి కరోనా సోకింది. అలాగే మంగళగిరి, మాచర్లలో పాజిటివ్‌ వ్యక్తుల బంధవులకు కూడా కరోనా సోకింది. మొత్తం మీద శనివారం నమోదైన పది కేసుల్లో 9 గుంటూరు అర్బన్‌లో ఉండగా ఒకటి గుంటూరు రూరల్‌లో నమోదైంది. ఇవన్నీ కూడా ఢిల్లీ మత సమ్మేళనానికి వెళ్లి వచ్చిన తరువాత సోకినవే కావడం గమనార్హం. తాజాగా వచ్చిన 10 మందిలో వేజండ్లకు చెందిన వ్యక్తి ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చారు. మిగిలిన వారిలో కుటుంబ సభ్యులకు, భార్యలకు వచ్చాయి.


బుచ్చయ్యతోటలో కరోన పాజిటివ్‌ సోకిన వ్యక్తి పక్కింటికి చెందిన ఓ వ్యక్తికి సోకింది. యూపీకి చెందిన వ్యక్తికి రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చిందా లేక పాజిటివ్‌ వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నాడా అనేది తెలియరాలేదు. ముప్పాళ్ళ మండలంలోని లంకెలకూరపాడులో ఇద్దరి హోం క్వారంటైన్‌లో ఉంచారు. వారు ఢిల్లీ నుంచి వస్తున్న ట్రెయిన్‌లో మధ్యలో ఎక్కి విజయవాడ వరకు ప్రయాణం చేసినట్టు గుర్తించామని అధికారులు తెలిపారు.


వన్‌టౌన్‌లో కలకలం

రోజు రోజుకు జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు గుంటూరు వన్‌టౌన్‌ కేంద్రంగా విస్తృతం అవుతుండటం అధికార వర్గాలను సైతం ఆందోళనకు గురి చేస్తుంది. ఆయా కాలనీల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. వన్‌టౌన్‌లోని అన్ని ప్రాంతాలకు వైరస్‌ వ్యాప్తి చెందడంతో అత్యధిక కాలనీలను రెడ్‌ జోన్‌లోకి చేర్చారు. కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారు స్వచ్ఛందంగా వస్తే వైద్యపరీక్షలు నిర్వహిస్తామని అర్బన్‌ పోలీస్‌ అధికారి, డీఐజీ రామకృష్ణ స్పష్టం చేశారు. పాతగుంటూరులోని కుమ్మరిబజారుతో పాటు రెడ్లబజారు, జాకీర్‌ హుస్సేన్‌నగర్‌, వినోభనగర్‌, ఆటోనగర్‌ తదితర ప్రాంతాలను రెడ్‌జోన్‌లో చేర్చి రాకపోకలను పూర్తిగా నియంత్రించేలా ఆదేశాలు ఇచ్చారు. వన్‌టౌన్‌లోని అనేక ప్రాంతాల్లో పోలీసులు శాశ్వత బారికేడ్‌లను ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు రాకపోకల జరగకుండా పూర్తిగా కట్టడి చేశారు. శ్రీనివాసరావుపేటలో కొంత ఏరియాని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. ఇక్కడి 60 అడుగుల రోడ్డుకు ఎడమవైపున ఉన్న ఏరియా నుంచి ఆరో లైను వరకు పూర్తిగా కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. 


కట్టుదిట్టంగా ఆంక్షలు:  ఐజీ ప్రభాకరరావు

రేంజ్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో ఆంక్షలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నట్లు రేంజ్‌ ఐజీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. పోలీస్‌ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. కరోనాా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనను కఠినంగా అమలు చేయాలని వైరస్‌ ఇతర ప్రాంతాలకు, కొత్తవారికి సోకకుండా కట్టడి చేయాలని ఆదేశించారు. మరోవైపు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని గుర్తించేందుకు పోలీస్‌ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయన్నారు. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని సూచించారు. 


మంగళగిరిలో రెండో పాజిటివ్‌ కేసు 

మంగళగిరి టౌన్‌: మంగళగిరి పట్టణంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి భార్య, కుమార్తె, పదేళ్ల బాలిక, ఇంట్లో అద్దెకు వుంటున్న మరో యువకుడితో సహా మొత్తం ఐదుగురిని వైద్య పరీక్షల నిమిత్తం కాటూరి ఆసుపత్రికి తరలించారు. భార్యకు కూడా కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్టు శనివారం అధికార వర్గాలు తెలిపాయి. కరోనా బాధితుడు ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు, ఎలాంటి కార్యకలాపాలు సాగించాడు అనే విషయాలపై అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఆరా తీస్తోంది.


వైరస్‌ తీవ్రతను దృష్టిలో వుంచుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తే వీలైనంత త్వరగా వ్యాప్తిని అరికట్టే అవకాశం వుంటుందని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన వ్యక్తి తల్లిదండ్రులు ఆ ఇంటి పక్కనే నివాసం వుంటున్నారు. వీరిని కూడా కాటూరి మెడికల్‌ కళాశాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం శనివారం మధ్యాహ్నం విశ్వప్రయత్నం చేసింది. వారిరువురూ కురువృద్ధులు కావడం... ఇటీవలే శస్త్రచికిత్సలు చేయించుకోవడంతో లేవలేని స్థితిలో వున్నారు. దీంతో అధికారులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.  

Updated Date - 2020-04-05T09:11:06+05:30 IST