పురాల్లో పన్ను పోటు

ABN , First Publish Date - 2020-11-26T05:16:39+05:30 IST

గుంటూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో ఆస్తి, తాగునీరు, ఖాళీస్థలం, డ్రెయినేజీ పన్నులు భారీగా పెరగనున్నాయి.

పురాల్లో పన్ను పోటు

రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా పెంపు

సర్వే, ప్రజాభిప్రాయం తీసుకోకుండానే ఉత్తర్వులు

తాగునీరు, డ్రెయినేజీ చార్జీలూ భారీగా పెరిగే అవకాశం

ప్రభుత్వ దొడ్డిదారి విధానాన్ని వ్యతిరేకిస్తోన్న జిల్లా ప్రజలు


గుంటూరు, నవంబరు 25 (ఆంధ్ర జ్యోతి): గుంటూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో ఆస్తి, తాగునీరు, ఖాళీస్థలం, డ్రెయినేజీ పన్నులు భారీగా పెరగనున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా అమలులో ఉన్న పన్నుల విధానాన్ని తొలగించి పెనుమార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబో తోన్నది. పన్నులు పెద్దగా పెరగవని వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సన్నాయి నొక్కులు నొక్కుతోన్నప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో ప్రతిపాదించిన శ్లాబులు చూస్తూనే పట్టణ ప్రజల గుండెలు గుభేల్‌మంటున్నాయి. పురపాలక సంఘాల్లో పాలకవర్గాలు లేని సమయంలో ప్రభుత్వం ఏకపక్షంగా అధికారుల ద్వారా పన్నులను పెంచేందుకు వడివడిగా అడుగులు వేస్తోండటం ఆందోళన కలిగిస్తోన్నది. గతంలో ఐదు శాతం పన్ను పెంచాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచించేవారు. అలాంటిది ఇప్పుడు వంద శాతం పైగా పన్ను పెంచుకునే అధికారాన్ని పురపాలక సంఘాలకు కల్పించడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రజల నడ్డి విరవడం ఖాయంగా కనిపిస్తోన్నది.


నూతన విధానంతో ఏటా పన్ను బాదుడే

జిల్లాలోని వివిధ పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఆస్తిపన్ను డిమాండ్‌ ఆరు నెలలకు రూ. 218.54 కోట్లుగా ఉన్నది. ఇందులో సింహభాగం రూ.146.96 కోట్లు గుంటూరు నగరంలోనివే. సహజంగా ఆస్తిపన్నుని ఏదైనా ఇల్లు కేటిగిరీ ఆధారంగా పొడవు, వెడల్పు లెక్కించి గజిట్‌ నోటిఫికేషన్‌లో ఆమో దించిన రేట్ల ప్రకారం నిర్ణయిస్తారు. అయితే ప్రభుత్వం కొత్తగా భూమి రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా పన్నుని ప్రతిపాదిస్తున్నది. దీని వల్ల చాలా వ్యత్యాసం ఏర్పడుతుంది. తొలుత 30 శాతం పెంచినా ఆ తర్వాత ఏటా పన్ను పెరుగుతూ పోతుంది. అలానే భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను ఏటా ఒకటి, రెండుసార్లు ప్రభుత్వం పెంచుతోన్నది. దీనిని పరిగణనలోకి తీసుకొంటే భూమి విలువ పెరిగిన ప్రతీసారి ఆస్తి పన్ను కూడా పెంచే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ప్రస్తుతం ఆరు నెలలకు రూ.వెయ్యి పన్ను చెల్లిస్తోన్న వారు రెట్టింపు చెల్లించాల్సి రావొ చ్చని మునిసిపల్‌ రంగంలో పని చేసి రిటైర్డు అయిన అనుభవజ్ఞులు చెబుతున్నారు.


నీటి పన్ను రూ. 100 నుంచి రూ.350 వరకు..

నీటి పన్ను విషయానికి వస్తే ప్రస్తుతం నెలకు రూ. 80 వరకు వసూలు చేస్తున్నారు. గత 20 ఏళ్లలో నీటి పన్ను కేవలం నెలకు రూ.20 మాత్రమే పెరిగింది. అలాంటిది నేడు రూ. 100 నుంచి రూ.350 వరకు పెంచుకునేందుకు ప్రతిపాదించారు. అపార్టుమెంట్‌లు, గ్రూపు హౌసింగ్‌లకు అయితే ప్రతీ వెయ్యి లీటర్లకు రూ.25 వసూలు చేస్తుండగా దీనిని రూ.30 నుంచి రూ.50కి పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. వాణిజ్య అవసరాలకు అయితే రూ.60 నుంచి రూ.140, పరిశ్రమలకు రూ.40 నుంచి 80కి పెంచుకునేందుకు సూచించారు. ఈ ధరల్లో మునిసిపాలిటీలు పన్నుని నిర్ణయిస్తాయి. ప్రతీ సంవత్సరం ఐదు శాతం పెంచుకునేలా తీర్మానం కూడా చేస్తాయి. డ్రెయినేజీ విషయానికి వస్తే 375 చదరపు అడుగు లోపు ఇళ్లకు రెండు మరుగుదొడ్ల లోపు నెలకు రూ.30 ప్రతిపాదించారు. 375 చదరపు అడుగులు దాటే ఇళ్లకు రూ.60 ప్రతిపాదించారు. అదనపు మరుగుదొడ్లకు నెలకు రూ.10 ప్రతిపాదించారు. కమర్షియల్‌ అయితే మూడు సీట్ల వరకు రూ.150, సంస్థలకు అయితే 10 సీట్ల వరకు రూ.300 ప్రతిపాదించారు. భవన నిర్మాణాల్లో అతిక్రమణలకు 50 శాతం నుంచి 100 శాతం పన్నుని పెనాల్టీగా విధించేందుకు ప్రతిపాదించారు. ఇప్పటికే పెరిగిన ఖాళీస్థలాల పన్నుతో బిల్డింగ్‌ ప్లాన్‌ పొందేందుకు రూ.లక్షల్లో చార్జీలు చెల్లించాల్సి వస్తోన్నది. కొత్తగా వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు అమలులోకి వస్తే ఆ చార్జీలు రెట్టింపయ్యే అవకాశం లేకపోలేదు.  

 

Read more