ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి :టీడీపీ

ABN , First Publish Date - 2020-03-12T07:07:27+05:30 IST

ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికల్లో పోలీసులే పక్షపాత చర్యలకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై తక్షణం చర్యలు

ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి :టీడీపీ

గుంటూరు, మార్చి 11: ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికల్లో పోలీసులే పక్షపాత చర్యలకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోరింది. ఈ మేరకు టీడీపీ ఎన్నికల కమిటీ జిల్లా కన్వీనర్‌ మన్నవ సుబ్బారావు బుధవారం జిల్లావ్యాప్తంగా చోటుచేసుకున్న పలు ఘటనలపై రూరల్‌ జిల్లా ఎస్పీ విజయరావు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదులు పంపారు. పల్నాడు ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకున్నాయని, తక్షణం చక్కదిద్దకుంటే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


ముఖ్యంగా మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై పోలీసులే తప్పుడు కేసులు బనాయించి బరి నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని రెంటచింతల, దుర్గి మండలాలకు పోట్ల సతీష్‌, యాగంటి నరేష్‌లు జడ్పీటీసీలుగా పోటీచేస్తున్నారన్నారు. అయితే రెంటచింతల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి పోట్ల సతీష్‌ ఇంట్లోకి అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా చొరబడ్డారన్నారు. స్వయంగా ఎస్‌ఐ 40 మద్యం బాటిళ్ళను తీసుకెళ్ళి జడ్పీటీసీ అభ్యర్థి ఇంట్లో దొరికినట్లు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయనను అక్రమంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి నిర్బంధించారన్నారు.


దుర్గి  జడ్పీటీసీ టీడీపీ అభ్యర్ధి నరేష్‌ను కూడా మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్ళి తెల్లారే వరకు అక్రమంగా నిర్బంధించారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయవద్దని పోలీసులే బెదిరించారని ఆయన పేర్కొన్నారు. పోటీచేస్తే కేసుల్లో ఇరికిస్తామని భయపట్టి ఉదయం విడిచి పెట్టారన్నారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు ఎంపీటీసీకి టీడీపీ  అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనిశెట్టి వెంకటేశ్వర్లును మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారన్నారు. పల్నాడు వ్యాప్తంగా అన్ని మండలాల్లో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలోని కారంపూడి మండలంలో రిజర్వుడ్‌ స్ధానాల్లో టీడీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు అందకుండా వీఆర్వోలను నిర్బంధించారన్నారు. టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెదిరించారన్నారు. వీరిలో కొంతమందిపై ఉన్న పాతకేసులను బూచిగా చూపి బెదిరించారన్నారు.


కేసులు లేని వారిని సైతం నామినేషన్‌ వేయకుండా సీఐ ఉమేష్‌, ఎస్‌ఐ రవికృష్ణ బెదిరించారన్నారు. సాక్షాత్తు పోలీసులే ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మన్నవ పేర్కొన్నారు. ఈ క్రమంలో పల్నాడులో ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం లేకుండా పోయిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఎన్నికల విధుల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారని, అధికార పార్టీకి కొమ్ము కాస్తూ పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  పల్నాడులో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని తక్షణం విధుల నుంచి తప్పించకుంటే ప్రశాంత ఎన్నికలను ఊహించడం కష్టమన్నారు.

పల్నాడులో వైసీపీ నేతల అరాచకాలు

పల్నాడు ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అరాచకాలకు పాల్పడుతుంది. దీనిలో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల చివరిరోజు కూడా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి.

 నరసరావుపేట పరిధిలోని ఇక్కుర్రు ఎంపీటీసీ మహిళా అభ్యర్థి గుంజి హైమావతిని వైసీపీ నాయకులు కిడ్నాప్‌ చేశారు.

నరసరావుపేట పరిధిలోని పాలపాడు ఎంపీటీసీ అభ్యర్థి రామిరెడ్డి నామినేషన్‌ పత్రాలను వైసీపీ నాయకులు చించివేశారు. అలాగే ములకలూరు, దొండపాడు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను కూడా వైసీపీ నాయకులు చించివేశారు. 

 అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి స్వగ్రామం బుచ్చిబాపనపాలెంలోను టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను చించివేశారు. అలాగే మన్నెసుల్తాన్‌పాలెం, బ్రాహ్మణపల్లె -1, పందిటివారిపాలెం, పిన్నెల్లి- 3లో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను కూడా చించివేశారు. 

 మాచర్ల నియోజకవవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం బోదెలవీడులో నామినేషన్‌ వేయడానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థులు నాగేంద్రం, లక్ష్మీదుర్గలపై వైసీపీ నాయకులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో తప్పుడు కేసులు పెట్టించారు.

 వెల్దుర్తి మండలం గుండ్లపాడు ఎంపీటీసీ అభ్యర్థి వెంకటేశ్వర్లు ఇంట్లో అక్రమంగా మద్యం సీసాలను పెట్టి అర్ధరాత్రి అరెస్టు చేశారు.

 రెంటచింతల  జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిపోట్ల సతీష్‌ ఇంట్లోనూ అక్రమంగా మద్యం సీసాలను పెట్టి అర్ధరాత్రి సతీష్‌తోపాటు ఆయన తండ్రి నరసింహారావులను కూడా అరెస్టు చేశారు.

 చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు చోద్యం చూశారు.


Updated Date - 2020-03-12T07:07:27+05:30 IST