వీడని సస్పెన్స్‌

ABN , First Publish Date - 2020-03-18T10:58:49+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్థానిక ఎన్నికల ప్రక్రియను..

వీడని సస్పెన్స్‌

ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై చర్చలు

ఏకగ్రీవాలలో ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్న అధికారులు

 

గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరువారాల పాటు వాయిదా వేసిన విషయం విదితమే.  ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో తమకు పని లేదనే విధంగా మండల స్థాయిలో ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఏకగ్రీవాలైన చోట అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్‌... ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దుచేసి మళ్లీ ప్రారంభిస్తే ఏకగ్రీవాల ధ్రువీకరణ పత్రాలు చెల్లవు. అయితే ధ్రువీకరణ పత్రం ఉంటే వారు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పరోక్షంగా అధికార పార్టీని సంతృప్తి పర్చడానికే రిటర్నింగ్‌ అధికారులు ఏకగ్రీవాలలో ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.


కోడ్‌ అమల్లో ఉందా? లేదా?

ఆరువారాల పాటు స్థానిక ఎన్నికలను వాయిదావేస్తూ యధావిధిగా కోడ్‌ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. దీనికి విరుద్ధంగా జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ఇళ్ళస్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు జిల్లాలో పర్యటించి పేదలకు పట్టాలు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. గుంటూరు మండలం జొన్నలగడ్డలో మంగళవారం ఇళ్ళపట్టాలను రెవెన్యూ అధికారులు పంపిణీచేశారు. కోడ్‌ అమలులో ఉండగా ఎలా పంపిణీచేస్తారని మీడియా ప్రశ్నించడంతో హడావిడిగా కార్యక్రమాన్ని ముగించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంతవరకు ముఖ్యమంత్రి బొమ్మలు ఉన్న పోస్టర్లను తొలగించలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, పట్టణ సచివాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు తొలగించలేదు. పది రోజుల్లో వీటిని తొలగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా జిల్లా యంత్రాంగం వాటిని ఖాతరుచేయడం లేదు. 


నామినేషన్‌, పోలింగ్‌ కేంద్రాలకు  వైసీపీ రంగులు

జిల్లాలో మున్సిపల్‌, నగరపాలక సంస్థ పరిధిలో నామినేషన్‌ కేంద్రాలకు వైసీపీ రంగులు వేశారు. ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు పట్టణ, గ్రామ సచివాలయాలు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన రైతు భరోసా కేంద్రాలను పోలింగ్‌ స్టేషన్లుగా ఎంపికచేశారు. ఈ కేంద్రాలకు ఇప్పటికే వైసీపీ రంగులు ఉన్నాయి. వాటిని తొలగించలేదు. ఇక్కడే పోలింగ్‌ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


మండలాలకు మెటీరియల్‌

జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్ని కల ప్రక్రియకొనసాగుతూనే ఉంది. రిటర్నింగ్‌ అధికారి శ్రీధర్‌రెడ్డి జడ్పీ కార్యాలయంలో పోలింగ్‌, ఇతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్నారు. జడ్పీ నుంచి ఎంపీడీవో కార్యాలయాలకు మెటీరియల్‌ పంపుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే పోలింగ్‌, లెక్కింపు, ఎన్నికల నిర్వహణ, ఇతర అంశాలపై శిక్షణ తరగతులు నిలిచిపోయాయి. ఎన్నికల కమిషన్‌ ఒకవేళ నామినేషన్ల ప్రక్రియను రద్దు చేసి మరలా నోటిఫికేషన్‌ జారీ చేస్తే ఇప్పటి వరకు కొనసాగిన ప్రక్రియ రద్దు అవుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీకి మద్దతుగా బ్యాలెట్‌ పత్రాల ముద్ర, ఇతర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 


బెంబేలెత్తుతున్న అధికారులు, ఉద్యోగులు

రాష్ట్రంలో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరుతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో కలెక్టర్‌, రూరల్‌ ఎస్పీలను బదిలీ చేయాలని కమిషన్‌ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దశలో అనవసరంగా కొంతమంది అభ్యర్థులను భుజానవేసుకుంటే ఇబ్బందులు పడతామని అందువల్ల నిష్పక్షపాతంగా ఉంటే మేలంటూ అధికారులు, ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే చిత్తూరు, గుంటూరు జిల్లాలపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా దృష్టిసారించింది. అందువల్ల ఎన్నికల కమిషన్‌ దృష్టిలో పడడం మంచిది కాదని వీరు భావిస్తున్నారు.

Updated Date - 2020-03-18T10:58:49+05:30 IST