40 కుటుంబాలకు నాలుగు ప్లాట్లా?

ABN , First Publish Date - 2020-12-27T05:24:51+05:30 IST

మేము ఎస్టీలం.. మా కాలనీ నుంచి 40 మంది ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకుంటే అందులో నలుగురికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారు.. అంటూ ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం ఎస్టీ కాలనీవాసులు హోంమంత్రి సుచరిత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

40 కుటుంబాలకు నాలుగు ప్లాట్లా?
హోంమంత్రి సుచరిత వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న పాతమల్లాయపాలెం ఎస్టీ కాలనీ వాసులు

 డాబాలు, ఆస్తులు ఉన్నవారికే ఇచ్చారు..

మావంటి పేదవారికి మొండిచేయి చూపారు..

హోం మంత్రి సుచరిత వద్ద ఆవేదన వ్యక్తం చేసిన ఎస్టీలు


ప్రత్తిపాడు, డిసెంబరు 26:  మేము ఎస్టీలం.. మా కాలనీ నుంచి 40 మంది ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకుంటే అందులో నలుగురికి మాత్రమే ఇళ్ల స్థలాలు ఇచ్చారు.. అంటూ  ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం ఎస్టీ కాలనీవాసులు హోంమంత్రి సుచరిత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పాతమల్లాయపాలెంలో ఇళ్ల  పట్టాల పంపిణీకి వచ్చిన ఆమెను స్థానిక ఎస్టీ కాలనీ మహిళలు, పెద్దలు కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. డాబాలు, ఆస్తులు ఉన్న వారికే స్థలాలు ఇచ్చారు.. మాలాంటి పేద వారికి మాత్రం మొండిచేయి చూపిస్తున్నారంటూ ఆరోపించారు. దీనిపై సుచరిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు స్థలాలు కేటాయించ లేదంటూ ప్రశ్నించారు. ఓ స్థానికుడు మాట్లాడుతూ తనకు నలుగురు కుమారులు ఉన్నారు.. ఇద్దరికే గృహాలు సరిపోతాయి.. మరి మిగిలిన వారి సంగతి ఏంటంటూ ప్రశ్నించారు.  సర్వే చేసి వివరాలు రెండ్రోజుల్లో మీకు ఇస్తానంటూ తహసీల్దార్‌ పూర్ణచంద్రరావు హోం మంత్రికి తెలిపారు. 


ఇంటి స్థలంతో మహిళలు లక్షాధికారులు..

 కేవలం ఒక ఇంటి స్థలంతోనే మహిళలందరూ లక్షాధికారులయ్యారని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రత్తిపాడు మండలంలోని పలు గ్రామాల్లో నివేశన స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తొలుత స్థానికులు రామవాగు నుంచి సుచరితను గుర్రం బండిపై ఊరేగించారు.  కార్యక్రమంలో  కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌, ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, మద్యవిమోచన కమిటీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T05:24:51+05:30 IST