కరోనాపై సమరం

ABN , First Publish Date - 2020-05-11T09:31:53+05:30 IST

నరసరావుపేటలో కరోనా నియంత్రణ కోసం పూర్తిగా నిర్బంధాన్ని అమలు చేస్తున్నట్టు సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

కరోనాపై సమరం

నరసరావుపేటలో పూర్తి నిర్బంధంతో వైరస్‌ నియంత్రణ చర్యలు  విస్తృతంగా కరోనా పరీక్షలు

ఈనెల 15 నాటికి జీరో కేసులే లక్ష్యం సబ్‌ కలెక్టర్‌ కె.దినేష్‌కుమార్‌  కేంద్ర కమిటీ సభ్యులకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌


నరసరావుపేట, మే 10: నరసరావుపేటలో కరోనా నియంత్రణ కోసం పూర్తిగా నిర్బంధాన్ని అమలు చేస్తున్నట్టు సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ కేంద్ర కమిటీ సభ్యులకు తెలిపారు. మునిసిపల్‌ బంగ్లాలో ఆదివారం ఆల్‌ ఇండియా ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ హైజిన్‌ అండ్‌  పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాబిపాల్‌, పబ్లిక్‌హెల్త్‌ స్పెషలిస్టు డాక్టర్‌ నందిని భట్టాచార్యకి సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ నియంత్రణ చర్యలను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తెలియ జేశారు. మిషన్‌ మే 15 అమలు చేస్తున్నామని, జీరో కేసులే లక్ష్యంగా రూపొందించామని దినేష్‌కుమార్‌ తెలిపారు. పట్టణంలో 163 కేసులు నమోదయ్యాయని, ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా గుర్తించి బారికేడ్లు నిర్మించటం జరిగిందన్నారు.


వైరస్‌ నియంత్రణకు కంటైన్‌మెంట్‌ జోన్‌లలో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. 545 మంది క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నారని వివరించారు. మూడురోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని చెప్పారు. వరవకట్టలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో వైరస్‌ పరీక్షలు నిర్వహించటం జరుగుతున్నదని తెలిపారు. పది వేలకు పైగా స్మార్ట్‌ ఫోన్‌లు పట్టణంలో వినియోగిస్తున్నట్టు, వీరిలో 1,100 మంది ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని సబ్‌ కలెక్టర్‌ వారికి వివరించారు.


ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడు చేసుకొనే విధంగా ప్రజలను చైతన్యపరచాలన్నారు. గుంటూరు నుంచి నరసరావుపేటకు వచ్చిన ఒక వ్యక్తి ద్వారానే వైరస్‌ వ్యాప్తి చెందిందని పేర్కొంటూ ప్రధానంగా వరవకట్టలో పెద్ద ఎత్తున కేసులు పెరగటానికి  కారణం అక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉండటమేనని తెలిపారు. భౌతిక దూరం పాటించటం, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్క్‌ల వినియోగంపై ప్రజలను చైతన్య పరిచామన్నారు. వైరస్‌ పరీక్షలు కూడా వేగవంతం చేసినట్టు తెలిపారు. 


అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలోని వైరస్‌ పరీక్షల కేంద్రాన్ని పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న టెస్ట్‌ల వివరాలను వైద్య బృందం వారికి వివరించింది. అత్యధికంగా కేసులు నమోదైన వరవకట్ట ప్రాంతాన్ని వారు సందర్శించారు. అక్కడ తీసుకుంటున్న చర్యలను సబ్‌ కలెక్టర్‌ వారికి వివరించారు. చిలకలూరిపేట రోడ్డులోని అబిడ్‌కో గృహ సముదాయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో వసతులను పరిశీలించారు. 

Updated Date - 2020-05-11T09:31:53+05:30 IST