వీధి వ్యాపారులకు విరివిగా రుణాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-10-08T09:17:07+05:30 IST

వీధి వ్యాపారస్థులని కాల్‌మనీ వ్యాపారుల నుంచి రక్షించాలంటే ప్రధానమంత్రి స్వనిధి, జగనన్న

వీధి వ్యాపారులకు విరివిగా రుణాలు ఇవ్వాలి

 బ్యాంకర్ల ప్రత్యేక సమావేశంలో కలెక్టర్‌ ఆదేశాలు


గుంటూరు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): వీధి వ్యాపారస్థులని కాల్‌మనీ వ్యాపారుల నుంచి రక్షించాలంటే ప్రధానమంత్రి స్వనిధి, జగనన్న తోడు పథకాల ద్వారా అర్హులైన వారిని గుర్తించి బ్యాంకర్లు ఉదారంగా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా సంప్రదింపులు కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది.


ఈ సమావేశంలో అజెండాకు సంబంధించి పీఎం స్వనిధి, జగనన్న తోడు, వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ బీమా పథకాల పురోగతిపై బ్యాంకర్లతో కలెక్టర్‌ సమీక్షించారు. రుణాల మంజూరుపై బ్యాంకులు, మునిసిపాలిటీలవారీగా నమోదైన దరఖాస్తులు, ఆమోదించినవి, నిధుల మంజూరుకు సిఫార్సు చేసిన వాటి వివరాలను కలెక్టర్‌ తెలుసుకొన్నారు. అయితే ఆశించినస్థాయిలో బ్యాంకర్లు రుణాలు మంజూరుచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

పీఎం స్వనిధి, జగనన్న తోడు పథకాల ద్వారా రోడ్లపై తోపుడు బండ్ల ద్వారా చిరువ్యాపారాలు చేసుకొనే వారికి రూ. 10వేలు బ్యాంకర్లు రణం అందించాలన్నారు. మునిసిపల్‌ కమిషనర్లు రుణాల మంజూరుపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పర్యవేక్షించాలని ఆదేశించారు.  కొన్ని బ్యాంకుల బ్రాంచ్‌ మేనేజర్లు దరఖాస్తుల స్వీకరణపై సరైనరీతిలో స్పందించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చే సచివాలయ ఉద్యోగులకు తగినగౌరవం ఇవ్వాలన్నారు. వైఎస్‌ఆర్‌ బీమా నమోదుకు అర్హులైన వారికి బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు.


సచివాలయాలకు బ్యాంకు సిబ్బందిని పంపించి అక్కడే బ్యాంకు అకౌంట్‌లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. ఈ నెల 17న మరోసారి ప్రత్యేక డీసీసీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.  సమావేశంలో జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి, జేసీ (ఆసరా) కె.శ్రీధర్‌రెడ్డి, డీసీసీ కన్వీనర్‌ ఎం. శ్రీనివాస్‌, ఎల్‌డీఎం ఈదర రాంబాబు, ఛైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్‌ కామేశ్వరరావు, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, డీఆర్‌డీఏ పీడీ డేవిడ్‌రాజు, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, సీనియర్‌ మేనేజర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-08T09:17:07+05:30 IST