కరోనాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు

ABN , First Publish Date - 2020-03-25T09:32:30+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నిఘా, నిర్వహణ బృందాలు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

కరోనాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌


గుంటూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నిఘా, నిర్వహణ బృందాలు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మెన్‌ అండ్‌ మెటీరియల్‌, ట్రైనింగ్‌, అవగామన, హాస్పిటల్‌ నిఘా, నిర్వహణ, మీడియా నిఘా,నిఇర్వహణ, డాక్యుమెంటేషన్‌, రిపోర్ట్స్‌, ఇంటర్‌ డిపార్టుమెంటల్‌ కోఆర్డినేషన్‌, సైకాలజీ సపోర్టు, వ్యూహం, క్వారంటైన్‌ ఫెసిలిటీ, క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌, ఫైనాన్స్‌, రవాణ, మౌలిక వసతుల నిర్వహణకు వేర్వేరుగా బృందాలను నియమించడం జరిగిందన్నారు.


వీరికి జిల్లా స్థాయి అధికారులను నోడల్‌ ఆఫీసర్లుగా వేశామని, వారు వైద్య ఆరోగ్య శాఖ నుంచి కేటాయించిన అధికారులను సమన్వయం చేసుకుని ప్రతీ రోజు విధులు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని బృందాల నోడల్‌ అధికారులు కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలకు సంబంధించి రోజు వారి నివేదికలను సంబంధిత బృందాలు సాయంత్రం ఆరు గంటలకు జిల్లా ఎమర్జన్సీ రెస్పాన్స్‌ కేంద్రం ఇన్‌చార్జి అయిన జాయింట్‌ కలెక్టర్‌కు నివేదించాలన్నారు.  సమావేశంలో జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ మౌర్య నారపురెడ్డి, జేసీ-2 శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో ఎన్‌వీవీ సతస్యన్నారాయణ, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ పాల్గొన్నారు. 


యాచకులు, అనాథలకు భోజన సదుపాయం కల్పించాలి

జిల్లాలో రహదారుల పక్క ఆశ్రయం పొందే యాచకులు, అనాఽథలకు అవసరమైన భోజనం, వసతి సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా వారికి భోజనం దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా అర్బన్‌ పరిధిలో వీరి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలకు ఏరియాలు కేటాయిస్తామని, వారు అక్కడ ఉండే యాచకులు, అనాఽథలకు భోజన, వసతి కల్పిస్తే సరిపోతుందన్నారు. యాచకులు ఆరుబయట ఉండటం వలన కరోన వైరస్‌ ప్రబలే అవకాశం ఉందన్నారు.  


ఇవి నిత్యావసరాలు

ఆహారం, పాలు, బ్రెడ్‌, వంట నూనెలు, పండ్లు, గ్రోసరీస్‌, కూరగాయలు, మాంసం, చేపలు నిత్యవసర సరుకులుగా జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. వీటి రవాణాకు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని పోలీసులకు లేఖ రాశారు. ఈ-కామర్స్‌ ద్వారా డెలివరీ చేసే ఫుడ్‌, మెడికల్‌, అపరాలను కూడా అనుమతించాలన్నారు. రెస్టారెంట్లు, హాటళ్లలో పార్శిల్‌, హోం డెలివరీలను అనుమతించాలన్నారు. పెట్రోలు బంకులు, ఎల్‌పీజీ గ్యాస్‌, ఆయిల్‌ ఏజెన్సీల రవాణాని కూడా అనుమతించాలని సూచించారు. 


156 మందిని క్వారంటైన్‌కు తరలించాం

జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 156 మందిని  క్వారంటైన్‌కు తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి కలెక్టర్‌ నివేదించారు. వీరిలో 103 మంది విదేశాల నుంచి వచ్చి ఐసోలేషన్‌లో ఉండేందుకు ఇళ్లల్లో వసతి లేని వారు ఉన్నారని చెప్పారు. అలానే 53 మంది నిబంధనలు ఉల్లంఘించి ఐసోలేషన్‌లో ఉండటానికి నిరాకరిస్తోండటంతో వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించడం జరిగిందన్నారు. మంగళవారం సీఎస్‌ సాహ్ని తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌లో జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఆమెకు వివరించారు.


విదేశాల నుంచి వచ్చిన వారందరిని ట్రాక్‌ చేసి హోం ఐసోలేషన్‌లో ఉంచుతోన్నామని, చిరునామాలు తెలియని వారి పాసుపోర్టు ఆధారంగా పోలీసుల సహకారంతో ట్రాక్‌ చేస్తోన్నామని చెప్పారు. కూరగాయల మార్కెట్లలో రద్దీని నియంత్రించేందుకు వేర్వేరు ప్రాంతాల్లో తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఉల్లంఘించి రహదారుల పైకి వచ్చిన 481 వాహనాలను సీజ్‌  చేసి,  75 కేసులు నమోదు చేశామన్నారు. సమావేశానికి ఏడీజీ త్రిపాఠి, ఎస్పీలు పీహెచ్‌డీ రామకృష్ణ, సీహెచ్‌ విజయారావు, జేసీ దినేష్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. 

Read more