అమ్మా.. నేనూ నీతోనే..తల్లి మరణవార్త విని ఆగిన కొడుకు గుండె
ABN , First Publish Date - 2020-12-05T18:56:38+05:30 IST
తల్లి మరణవార్త విని కుమారుడు హఠాన్మరణం చెందిన ఘటన మండలంలోని అప్పాపురంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

మృతుడు ప్రభుత్వ పాఠశాల పీఈటీ
కాకుమాను (గుంటూరు): తల్లి మరణవార్త విని కుమారుడు హఠాన్మరణం చెందిన ఘటన మండలంలోని అప్పాపురంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దారా విజయమ్మ(78) అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆమె కుమారుడు, కర్లపాలెం మండలం గణపవరం జెడ్పీ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న దారా సజ్జనరావు(58) విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లిన విజయమ్మ మృతి చెందినట్లు అక్కడి నుంచి ఫోన్లో ఆయనకు సమాచారం అందింది. దీంతో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. సజ్జనరావుకు భార్య జయలక్ష్మీకుమారి, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకేరోజు కుటుంబంలో ఇద్దరు మరణించడంతో కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.