వైరస్.. వలస
ABN , First Publish Date - 2020-06-18T09:56:07+05:30 IST
కరోనా వైరస్ వలస వస్తోంది. జిల్లాకు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వారు వైరస్‌ను మోసుకొస్తున్నారు.

క్వారెంటైన్‌లోని ఆరుగురికి వైరస్
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి..
జిల్లాలో తాజాగా మరో 17 మందికి కరనో
నరసరావుపేటలో గర్భిణికి పాజిటివ్‌గా నిర్ధారణ
దాచేపల్లిలో కూరగాయల వ్యాపారి ద్వారా నలుగురికి
గుంటూరు ఐపీడీకాలనీలో వైద్య విద్యార్థిని తండ్రికీ పాజిటివ్
ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్, జూన్ 17: కరోనా వైరస్ వలస వస్తోంది. జిల్లాకు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వారు వైరస్‌ను మోసుకొస్తున్నారు. వీరి కారణంగా కొత్త ప్రాంతాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో బుధవారం ప్రభుత్వం ప్రకటించిన 17 కేసుల్లో ఆరుగురు క్వారెంటైన్‌లోనే ఉన్న వారే. వీటితో జిల్లాలో కేసుల సంఖ్య721కు చేరింది. గుంటూరు ఐపీడీకాలనీకి చెందిన గతవారం కరోనా భారిన పడిన వైద్య విద్యార్థిని తండ్రికి పాజిటివ్ వచ్చింది. ఈయన బాపట్ల సమీపం ముత్తాయపాలెంలో ఉపాధ్యాయుడని అధికారులు గుర్తించారు. మూడు నెలలుగా ముంబైలో ఉండి వారం క్రితం స్వర్ణభారతినగర్‌కు వచ్చిన యువతికి కరోనా సోకింది. సాధారణ పరీక్షల్లో ఆమెకు వైరస్ బయట పడింది. ఇన్నర్‌రింగ్‌రోడ్డులోని క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న చెన్నై నుంచి వచ్చిన ఒకరికి, ముంబై నుంచి వచ్చిన మరో ముగ్గురికి కరోనా సోకింది. ఇక దాచేపల్లిలో ఐదుగురికి, తాడేపలి, అప్పాపురం, మంగళగిరి, పెదనందిపాడు, నరసరావుపేట, బాపట్లలో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా అధికారులు ప్రకటించారు.
నరసరావుపేట బరంపేట మిట్టబజారుకు చెందిన ఓ గర్భిణికి పాజిటివ్ నమోదైనట్టు ప్రకటించారు. ఈమెకు 9 నెలలు నిండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈమె సంబంధీకులను గుర్తించి క్వారెంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బరంపేటలో 11 మందికి కరోనా సోకగా కేసుల సంఖ్య నరసరావుపేటలో 216కు చేరింది.
నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు పాజిటివ్‌గా నిర్ధారించారు. గుంటూరులో ఓ అపార్ట్‌మెంట్‌లో ఈమె దోబీ పని చేస్తుండగా, భర్త వాచ్‌మన్. అయితే కొద్ది రోజుల క్రితం ఆ అపార్ట్‌మెంట్‌లో పాజిటివ్ కేసు రావడంతో అందరికీ పరీక్షలు నిర్వహించారు. దీంతో కరోనా భయంతో నాలుగు రోజుల క్రితం ఈమె కుటుంబసభ్యులు స్వగ్రామమైన అప్పాపురానికి వచ్చారు. పరీక్ష ఫలితాల్లో మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తహసీల్దార్ సాంబశివరావు, ఎంపీడీవో మోషే, డాక్టర్ శ్యామ్‌సన్ గ్రామాన్ని సందర్శించి ఆ మహిళతో కాంటాక్ట్‌లో ఉన్న తొమ్మిది మందిని క్వారంటైన్‌కు తరలించారు.
పెదనందిపాడు మండలం ఉప్పలపాడులో తొలి పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో కుమారుడు భార్యతో కలిసి ఈ నెల 9న హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చారు. 13న పరీక్షలు నిర్వహించగా కోడలకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను క్వారెంటైన్‌కు తరలించారు.
దాచేపల్లిలో బుధవారం ఒక్క రోజు ఐదుగురికి పాజిటివ్‌గా అధికారులు ప్రకటించారు. దాచేపల్లిలోని కారంపూడి బస్టాప్ వద్ద కూరగాయలు అమ్మే వ్యాపారిని కొద్దిరోజుల క్రితం కరోనాతో క్వారంటైన్‌కు తరలించారు. అతడి సన్నిహితులకు పరీక్షలు నిర్వహించగా భార్య, కుమారుడు, వారి ఇంటిపై గృహాంలో అద్దెకు ఉండే దంపతులకు, తక్కెళ్లపాడులోని ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్లు తేలిందని తహసీల్దారు లెవీ తెలిపారు. గతంలో నారాయణపురంలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి సంబంధీకులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఆ తర్వాత కేసులు లేవని ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో మళ్లీ వైరస్ ఊపందుకుంది. మెయిన్‌బజారులో 20 రోజులు దుకాణాలు మూయాలని అధికారులు ఆదేశాలిచ్చారు.
బాపట్ల మండలం అసోదివారిపాలేనికి చెందిన ఓ యువకుడికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మానస ప్రియదర్శిని తెలిపారు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఇతడు స్వగ్రామమైన ఆసోదివారిపాలేనికి రైలులో వస్తుండగా పరీక్షలు నిర్వహించి విజయవాడక్వారంటైన్‌లో ఉంచారు. 14 రోజులుగా ఉన్న ఇతడికి వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇతడ్ని గుంటూరు కరోనాసెంటర్‌కు తరలించారు.
పొన్నూర మండలం మన్నవలో గర్భిణికి పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో తహసీల్దారు పద్మనాభుడు, ఎంపీడీవో అత్తోట దీప్తి, వైద్యాధికారి ఝాన్సీరాణి గ్రామాన్ని సందర్శించారు. ఆమె సంబంధీకులను 11 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు.
మాస్క్ లేకుంటే.. జరిమానా
కరోనా నేపథ్యంలో ప్రజలందరూ మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని, మాస్క్ లేనివారికి రూ. వెయ్యి జరిమానా విధించాలని నగర పాలక సంస్థ కమిషనర్ అనురాధ తెలిపారు. బుధవారం గుంటూరులోని వార్డు సచివాలయ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాస్క్ లేకుండా దుకాణాల్లోకి అనుమతించకుండా చూడాలని వార్డు సచివాలయాల సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.
బస్టాండ్‌లోనే కొవిడ్-19 పరీక్షలు
బెంగళూరు నుంచి ఆర్టీసీ సర్వీసులలో జిల్లాకు చేరుకునే ప్రయాణికులకు బస్టాండ్‌లోనే కొవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ నుంచి అనుమతి వచ్చింది. దీంతో గుంటూరు-1, వినుకొండ నుంచి ఒక్కో సర్వీసును బెంగళూరుకు బుధవారం ప్రారంభించారు.