వెంటాడి.. వేధింపులు

ABN , First Publish Date - 2020-09-14T08:52:30+05:30 IST

‘ఈఎస్‌ బాలకృష్ణన్‌ కొద్ది నెలలుగా వ్యక్తిగతంగా..

వెంటాడి.. వేధింపులు

గుంటూరు నుంచి పెదకూరపాడు వెళ్లినా ఆగలేదు

విచారణ అధికారుల ఎదుట కన్నీరు మున్నీరైన ఎస్‌ఐ 

ఈఎస్‌ బాలకృష్ణన్‌పై రెండో రోజూ  కొనసాగిన విచారణ

  

గుంటూరు(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ, అసభ్య పదజాలంతో వేధింపులకు గురిచేసే వారని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)లో ఎస్‌ఐ సీహెచ్‌ గీత విచారణాధికారి ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఈఎస్‌ బాలకృష్ణన్‌పై రెండోరోజు ఆదివారం గుంటూరులోని పోలీసు కార్యాలయంలో విచారణ కొనసాగింది. విచారణాధికారి ఎదుట హాజరైన గీత.. బాలకృష్ణన్‌ వేధింపులు తాళలేక గుంటూరు నుంచి పెదకూరపాడుకు వెళ్ళానని, అయినా వేధించేవారని పలు అంశాలను ఉదహరించారు. అనంతరం ఈఎస్‌ కార్యాలయ సిబ్బంది, పెదకూరపాడు ఇతర ప్రాంతాల్లోని స్టేషన్ల సిబ్బందిని పిలిపించి విచారించారు.


‘ఈఎస్‌ బాలకృష్ణన్‌ కొద్ది నెలలుగా వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసేవారు. అనేక వ్యవహారాల్లో సంబంధం లేకపోయినా తన పాత్ర ఉందని బెదిరించేవారు. వ్యక్తిగతంగా కూడా దోషిని చేస్తూ బయటకు చెప్పుకోలేని విధంగా అసభ్య పదజాలంతో టార్చర్‌ చేసేవారు...’ అని విచారణాధికారి ఎదుట ఆదివారం బాధిత ఎస్‌ఐ గీత కన్నీటి పర్యంతమయ్యారు. ఈఎస్‌ బాలకృష్ణన్‌పై రెండో రోజు ఆదివారం గుంటూరులోని పోలీస్‌ కార్యాలయంలో విచారణ కొనసాగింది. ఆయనపై ఫిర్యాదు చేసేందుకు పెద్దసంఖ్యలో బాధితులు క్యూ కట్టారు. ఈ క్రమంలో తొలుత శనివారం ఆత్మహత్యకు యత్నించిన ఎస్‌ఐ గీత విచారణ అధికారుల ఎదుట హాజరై పలు వివరాలు అందజేశారు.


గుంటూరు టూ టౌన్‌ ఇన్‌చార్జి సీఐగా ఉన్నప్పటి నుంచి వేధింపులు భరించలేకపోయానన్నారు. బాలకృష్ణన్‌ వేధింపులు తాళలేక గుంటూరు నుంచి పెదకూరపాడుకు వెళ్ళానన్నారు. పెదకూరపాడు వెళ్లినా కూడా వదలకుండా పలు రకాలుగా వేధించేవారని ఆవేదన వెళ్లగక్కారు. పరువు పోవడంతోనే ఆత్మహత్యకు యత్నించినట్లు వాపోయారు. అనంతరం ఈఎస్‌ కార్యాలయ సిబ్బంది, పెదకూరపాడు ఇతర ప్రాంతాల్లోని స్టేషన్ల సిబ్బందిని పిలిపించి విచారించారు. ఆయన మానసిక, లైంగిక వేధింపులు అంతా ఇంతా కాదని బాధితులు వివరించారు. వృత్తిపరంగానే కాక వ్యక్తిగతంగాను కూడా వేధింపులకు గురి చేసేవారని, ప్రతి అంశంలో తమను ఇరికించేవారని ఫిర్యాదు చేశారు.


నివేదిక అందజేస్తాం: విచారణ కమిటీ 

బాలకృష్ణన్‌కు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో విచారణ నివేదికను రాష్ట్ర కమిషనర్‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు. రెండో రోజు విచారణలో అదనపు ఎస్పీ రమాదేవి, ఈఎస్‌ వివేక్‌, ఏఈఎస్‌ లావణ్య పాల్గొన్నారు. 


నిర్భయ కేసు నమోదు చేయాలి : ఎమ్మెల్యే శంకరరావు

మహిళా అధికారుల పట్ల దారుణంగా వ్యవహరించిన నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేయాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు తెలిపారు. ఎక్సైజ్‌ ఎస్‌ఐ గీత ఆత్మహత్యాయత్నం సంఘటనపై స్పందించిన ఆయన నేరుగా రాష్ట్ర సెబ్‌ కమిషనర్‌ వినీత్‌ బ్రిజిలాల్‌తో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలను ఉపేక్షించేది లేదన్నారు. మహిళా అధికారులకు రక్షణ కల్పించాలని కోరారు. 

Updated Date - 2020-09-14T08:52:30+05:30 IST