నామినేషన్ల పరిశీలన పారదర్శకంగా జరగాలి : జిల్లా ఎన్నికల అధికారి

ABN , First Publish Date - 2020-03-12T07:04:38+05:30 IST

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల అధికారి ఐ శామ్యూల్‌

నామినేషన్ల పరిశీలన పారదర్శకంగా జరగాలి  : జిల్లా ఎన్నికల అధికారి

గుంటూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల అధికారి ఐ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ రిటర్నింగ్‌ అధికారులను ఆదే శించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నియమావళిని తూచ తప్పకుండా పాటించాలన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్‌వోలతో ఆయన మాట్లాడారు. నామినేషన్ల పరిశీలన ప్రకియ గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించాలన్నారు.


సీరియల్‌ ప్రకారం పరిశీలన జరపాలన్నారు. అభ్యర్థితో పాటు ప్రతిపాదించిన వ్యక్తిని, అధీకృతం చేసిన వ్యక్తిని కలిపి ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమ తించాలన్నారు. నామినేషన్‌ పత్రాలలో అక్షర దోషాలను పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేశారు. నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటికి సంబంధించిన ఆధారాలను తీసుకోవాలని ఆదేశించారు. తిరస్క రించిన నామినేషన్లకు కారణాలను వివరిస్తూ చెక్‌లిస్టుపై సంబంధిత అభ్యర్థి సంతకం తీసుకొని రశీదు ఇవ్వాలన్నారు. అభ్యర్థి వయస్సు నామినేషన్‌ పరిశీలన తేదీకి తప్పక 21 సంవత్సరాలు ఉండాలన్నారు. రిజర్వుడ్‌ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు అందించే కులధ్రువీకరణ పత్రాలు మాన్యువల్‌గా ఉన్నా ఆమోదించాలని చెప్పారు. ఆమోదించిన నామినేషన్లను జాతీయ, రాష్ట్ర, గుర్తింపు పొందిన పార్టీలు, ఇండిపెం డెంట్‌లు వారీగా తెలుగు భాష అక్షర క్రమంలో జాబితా తయారు చేయాలన్నారు. ఈ సమావేశానికి జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, డీఆర్‌వో సత్యన్నారాయణ హాజరయ్యారు. 

కోవిడ్‌-19 వ్యాప్తిపై ఆందోళన చెందొద్దు

జిల్లాలో కోవిడ్‌-19 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె సచివాలయం నుంచి కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖ గడప గడప సర్వే కోసం నూతనంగా రూపొందించిన కోవిడ్‌- 19 యాప్‌లో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో గురువారం సాయంత్రం కల్లా నమోదు చేయాలన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వచ్చి విదేశీయులు, వారితో కలిసి ఉన్న వారిని తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. సమావేశానికి కలెక్టర్‌ ఐ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, జేసీ దినేష్‌కుమార్‌, డీఆర్‌వో సత్యన్నారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బాబులాల్‌, ఐడీ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ భూషణ్‌రావు, డీసీఎంహెచ్‌ డాక్టర్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-12T07:04:38+05:30 IST