సంగం పాల ధరలపై అవాస్తవ ప్రకటన తగదు

ABN , First Publish Date - 2020-12-02T05:00:21+05:30 IST

శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారులకు తక్కువ ధర చెల్లిస్తున్నారని ప్రకటించటం పూర్తి అవాస్తవం అని సంగం డెయిరీ యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో ఖండించింది.

సంగం పాల ధరలపై అవాస్తవ ప్రకటన తగదు

చేబ్రోలు, డిసెంబరు 1: శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారులకు తక్కువ ధర చెల్లిస్తున్నారని ప్రకటించటం పూర్తి అవాస్తవం అని సంగం డెయిరీ యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో ఖండించింది. కొన్ని సంవత్సరాలుగా పాల ఉత్పత్తిదారులకు సంగం డెయిరీ మాత్రమే అత్యధిక ధర చెల్లిస్తుందని స్పష్టం చేసింది. మిగిలిన లాభాలను బోనస్‌ రూపంలో పాల ఉత్పత్తిదారులకే చెల్లిస్తున్నట్లు పేర్కొంది. అమూల్‌ డెయిరీ గేదె, ఆవు పాలకు ప్రకటించిన రేట్ల కంటే 2019-20 సంవత్సరంలో సంగం డెయిరీ అత్యధిక ధర చెల్లిస్తుందని సంగం వర్గాలు తెలిపారు. 2019-20 సంవత్సరంలో గుంటూరు జిల్లాలో  సరాసరి గేదె పాలకు 6 శాతానికి రూ.46.83, ఆవుపాలకు రూ.30.19 ధర చెల్లిస్తుండగా అమూల్‌ డెయిరీ ప్రకటించిన ధర సరాసరి గేదెపాలకు రూ.45.48, ఆవుపాలకు రూ.28 లీటర్‌కు చెల్లించాలని నిర్ణయించిందన్నారు. ప్రకాశం జిల్లాలో సంగం డెయిరీ ఏవరేజ్‌ వెన్నశాతం గేదె పాలకు లీటర్‌కు రూ.47.07, ఆవుపాలకు రూ.30.29 చెల్లించిందన్నారు.  అమూల్‌ డెయిరీ గేదె పాలకు రూ.45.48, ఆవుపాలకు రూ.28 చెల్లించేలా నిర్ణయించిన్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో సరాసరి వెన్నశాతం లీటరు ఆవుపాలకు సంగం డెయిరీ రూ.29.89 ధర చెల్లించగా అదే పరిమాణంలో అమూల్‌ డెయిరీ ఆవు పాలకు రూ.28 ధర చెల్లించాలని నిర్ణయించిందన్నారు. 2019-20 సంవత్సరంలో 9.06 కోట్ల లీటర్ల పాలకు ఈ విధమైన ధర చెల్లించిన్నట్లు చెప్పారు. పాల ఉత్పత్తిదారులందరికీ బీమా సౌకర్యం కల్పించటంతోపాటు, ప్రాథమిక అత్యవసర పశువైద్య సేవలు సంగం డెయిరీ అందిస్తుందని చెప్పారు. సబ్సిడీపై పశు దాణా, పశుగ్రాస విత్తనాలు, శైలేజ్‌, మినరల్‌ మిక్చర్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి ఏడాది రూ.2.58 కోట్ల నిధులతో పశు వైద్యసేవలు అందించింది. ప్రస్తుతం సంగం డెయిరీ గేదె పాలకు రూ.636 కిలో వెన్నె రేటు, ఆవులపాలకు రూ.220 నుంచి రూ.230 వరకు కిలో ఘన పదార్ధాల రేటు అమలులో ఉన్నట్లు సంగం డెయిరీ వర్గాలు తెలిపారు. లాభాలను మదింపు చేసుకొని ఏడాది చివరిలో లీటర్‌కు రూ.2 నుంచి రూ.5 వరకు బోనస్‌ చెల్లిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంగం డెయిరీ రోజుకు 3.52 లక్షల లీటర్ల పాల సేకరణ చేస్తుంది. 1977 నుంచి పాడి రైతులతో మమేకమైన సంగం డెయిరీ గణనీయమైన ప్రగతి సాధించిన్నట్లు సంగం డెయిరీ వర్గాలు తెలిపారు. ప్రస్తుతం రూ.1000 కోట్లకు వార్షిక వ్యాపారం చేరటమే సంగం ప్రగతికి నిదర్శనం అన్ని సంగం డెయిరీ వర్గాలు ప్రకటనలో తెలియజేశాయి.


Updated Date - 2020-12-02T05:00:21+05:30 IST