ఇసుకలో సగం రాళ్లే!

ABN , First Publish Date - 2020-07-19T17:01:02+05:30 IST

ఏపీ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సరఫరా చేస్తున్న..

ఇసుకలో సగం రాళ్లే!

నాసిరకమైన ఇసుకని సరఫరా చేస్తున్న ఏపీఎండీసీ

కాంక్రీట్‌ మిక్సింగ్‌కు పనికిరాని పరిస్థితి

బోరుమంటోన్న వినియోగదారులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఏపీ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సరఫరా చేస్తున్న ఇసుక నాసిరకంగా ఉంటోంది. సగానికి పైగా గుండ్రాళ్లతో మిళితమై ఎందుకూ పనికి రావడం లేదు. పొరపాటున ఆ ఇసుకని చూడకుండా శ్లాబు, పిల్లర్లు, బీములకు వినియోగిస్తే వాటి పని ఇక అంతే. లారీకి రూ.18 వేలు ఖర్చు పెట్టి నెలా 10 రోజుల పాటు నిరీక్షించినా నాణ్యమైన ఇసుకని సరఫరా చేయకపోతుండటంపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుండ్రాళ్ల రూపంలో తమకు జరుగుతున్న నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. 


నగరానికి చెందిన షేక్‌ హసీనా అనే మహిళ తన ఇంటి నిర్మాణం కోసం గత నెల 10వ తేదీన ఆన్‌లైన్‌లో 18 టన్నుల ఇసుక బుకింగ్‌ చేశారు. ఆ రోజున నరసరావుపేట ఇసుక డిపోలో ఇసుక నిల్వలు ఉండటంతో ఆ డిపోని ఆమె ఎంపిక చేసుకొన్నారు. మూడు రోజుల్లోనే పంపిస్తామని సందేశం పంపిన అధికారులు తీరా నెలా 8 రోజుల తర్వాత శనివారం ఇసుక లారీని ఇంటికి పంపించారు. ఆ ఇసుక డంప్‌ చేయగానే పూర్తిగా గుండ్రాళ్లతో నిండి ఉండటం చూసి ఆమె బోరుమన్నారు. ఇదేవిధంగా షేక్‌ అల్లాభక్షు అనే వ్యక్తి మిర్చియార్డు వర్కర్స్‌ కాలనీలో ఇంటి మరమ్మతుల కోసం లారీ ఇసుకని బుకింగ్‌ చేసుకొన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుగానే ఆన్‌లైన్‌లో రూ.18,103 చెల్లించారు. నాణ్యమైన ఇసుక వస్తుందని ఆశించగా ఆయనకు కూడా గుండ్రాళ్లతో నిండిన ఇసుకనే ఏపీఎండీసీ సరఫరా చేసింది. 


తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 18 టన్నుల లారీకి రూ.8 వేల నుంచి 10 వేలు చెల్లిస్తే ఎంతో నాణ్యమైన ఇసుకని తీసుకొచ్చి ఇంటి వద్ద అన్‌లోడింగ్‌ చేసేవారని వినియోగదారులు చెబుతున్నారు. అలాంటిది ఇసుక సరఫరాలో అవినీతికి అరికడతామని ఓ పక్క ప్రభుత్వం చెబుతూ ఇలా నాసిరకమైన ఇసుకని సామాన్యులకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సంవత్సరం నుంచి పాలసీల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం తప్ప ఇసుక విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమి లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. Updated Date - 2020-07-19T17:01:02+05:30 IST