ఇసుక పక్కదారి!

ABN , First Publish Date - 2020-05-19T08:47:24+05:30 IST

ప్రభుత్వం రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని స్టాక్‌ పాయింట్ల వద్ద ఇసుక నిల్వ చేస్తోంది

ఇసుక పక్కదారి!

స్టాక్‌ పాయింట్లకు తరలించకుండా బయటే విక్రయం 

జీపీఎస్‌ విధానం ఉన్నా అక్రమాలు


నరసరావుపేట, మే 18: ప్రభుత్వం రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని స్టాక్‌ పాయింట్ల వద్ద ఇసుక నిల్వ చేస్తోంది. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. ఇసుక రీచ్‌ల నుంచి లారీల ద్వారా తీసుకొస్తున్న ఇసుక స్టాక్‌ పాయింట్లకు తరలించకుండా అనధికారికంగా బిల్డర్లకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక రీచ్‌ నుంచి ఇస్సపాలెం వద్ద ఉన్న స్టాక్‌ పాయింట్‌కు తరలించాల్సిన ఇసుకను ప్రైవేట్‌ వ్యక్తులతో లావాదేవీలు ఏర్పాటు చేసుకొని తరలిస్తున్నారు. ఇలా 15 లారీల ఇసుకను దారి మళ్ళించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీపీఎస్‌ విధానం ఉన్నా అక్రమాలు జరుగుతుండటం గమనార్హం. పట్టణంలోని ఒక వే బ్రిడ్జి వద్ద తూకం వేసి విక్రయిస్తుండటం ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.


ఇసుక రీచ్‌ వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లించి టన్ను ఇసుక నుంచి రూ.1,200 నుంచి రూ.1,500 వరకు వచ్చిన కాడికి అమ్ముకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. రీచ్‌ల వద్ద ఒక వ్యక్తి అక్రమాలకు పాల్పడటంతో అతన్ని విధుల నుంచి తొలగించారు. అదే వ్యక్తి ఇసుక అక్రమ తరలింపుకు సూత్రధారిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. స్టాక్‌ పాయింట్‌కు ఇసుక తరలించినట్లయితే అక్కడి నుంచి టన్నుకు రూ.700 చెల్లించి బిల్డర్లు ఇసుకను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం ముందుగా దరఖాస్తు చేయాలి. ఈ ప్రక్రియ లేకుండా ఇసుక అక్రమ మార్గం పడుతుండటంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక తరలింపుపై సంబందిత అధికారిని వివరణ కోరగా ఇసుక రీచ్‌ నుంచి స్టాక్‌ పాయింట్‌కు చేరే వరకు జీపీఎస్‌ విధానం అమల్లో ఉంటుందని చెప్పారు. ఒక వేళ ఇసుక అక్రమంగా తరలిస్తే సదరు లారీ యజమాని బిల్లు దాఖలు చేసిన సమయంలో పరిశీలించి మూడురెట్లు జరిమానా విధించటం జరుగుతుందని సదరు అధికారి చెప్పారు. స్టాక్‌ పాయింట్లకు రాకుండానే ఇసుక లారీలను పక్కదారి పట్టించి విక్రయిస్తుండటంపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. లేకుంటే ప్రభుత్వ ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. 

Updated Date - 2020-05-19T08:47:24+05:30 IST