రోడ్డెక్కిన మైనింగ్ వివాదాలు
ABN , First Publish Date - 2020-09-12T10:02:24+05:30 IST
రెండు దశాబ్దాలకు పైగా వేలాది మంది కార్మికులు పల్నాడు ప్రాంతంలోని క్వారీల్లో ప్రశాంతంగా పని చేసుకుంటూ జీవనం

రెండు వర్గాలైన క్వారీల కార్మికులు
ఎన్నడూ లేనివిధంగా దాడులతో భయాందోళనలు
దాడిలో గాయపడిన ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమం
ముందుజాగ్రత్తగా అంజనాపురంకాలనీలో పోలీసు బందోబస్తు
గుంటూరు, సెప్టెంబరు 11: రెండు దశాబ్దాలకు పైగా వేలాది మంది కార్మికులు పల్నాడు ప్రాంతంలోని క్వారీల్లో ప్రశాంతంగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో ఎక్కడకెక్కడికో ఉపాధి కోసం వెళ్లేవారు. అలాంటిది స్థానికంగా పనులు దొరకడంతో కుటుంబాలతో కలిసికట్టుగా పనులు చేసుకుంటూ ఉండేవారు. అయితే కొంతకాలంగా దాచేపల్లిలోని క్వారీ కార్మికుల మధ్య రాజకీయ చిచ్చు రేగింది. దీంతో మైనింగ్ వివాదాల్లో చిక్కుకున్న కార్మికులు రెండువర్గాలయ్యారు. ఇటీవల వరకు లోలోపల ఉన్న వివాదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దాచేపల్లి మండలం నారాయణపురం మైనింగ్ క్వారీలను నరసరావుపేటకు చెందిన బండారు బయ్యన్న నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానిక కార్మికులు చాలా రోజుల నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంజనాపురంలో ఉంటున్న కార్మికుడు బయ్యన్నను వ్యక్తిగతంగా దూషించారన్న నెపంతో వివాదం చెలరేగింది.
అంజనాపురానికి వెళ్లి బయ్యన్నను దూషించిన వ్యక్తితో బయన్న, అతడి అనుచరులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో గురువారం నారాయణపురంలోని రామాలయం వద్ద కుల పెద్దలతో పంచాయితీ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో బయ్యన్న అనుచరులు స్థానిక కార్మికులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో బత్తుల శ్రీనివాసరావు, బత్తుల రాజు, తమ్మిశెట్టి అనీల్‌కుమార్, తమ్మిశెట్టి నీలకంఠబాబు, తమ్మిశెట్టి గోపిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గురజాలకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు.
గాయపడిన వారిలో బత్తుల శ్రీనివాసరావు ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమనడంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులను కత్తులతో పొడవటం తీవ్ర వివాదాస్పదమైంది. గతంలో విభేదాలు వచ్చినా కుల పెద్దలు, కార్మిక సంఘాల నాయకులు జోక్యం చేసుకుని సర్ది చెప్పేవారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు.
నలుగురిపై కేసు
దాచేపల్లి: దాచేపల్లి పరిధిలోని నారాయణపురంలో గురువారం జరిగిన దాడికి సంబంధించి బత్తుల బయ్యన్న సహా నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బాలనాగిరెడ్డి శుక్రవారం తెలిపారు. దాడికి గురైన బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ బండారు అంజన్‌రాజు అంజనాపురం కాలనీకి చేరుకొని బాధితులతో మాట్లాడి విచారం వ్యక్తం చేశారు.