బియ్యం.. గుడ్లు స్వాహా!

ABN , First Publish Date - 2020-08-09T10:03:32+05:30 IST

జిల్లాలో 3,710 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు.

బియ్యం.. గుడ్లు  స్వాహా!

 మధ్యాహ్న భోజన పథకంలో మతలబులు

బియ్యం పంపిణీలో ఏజన్సీల చేతివాటం

కోడిగుడ్లనూ మింగేశారు..

పంపిణీ చేయకుండానే పూర్తయినట్లు రికార్డులు

పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే ఓ ఉపాఽధ్యాయుడి సస్పెండ్‌

ఏజన్సీ నిర్వహకులకూ రాజకీయ సెగ


పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కొందరు ఉపాధ్యాయులు, ఏజన్సీ నిర్వాహకులకు కాసులు వర్షం కురిపిస్తోంది. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు భోజనానికి బదులు పంపిణీ చేయాల్సిన  బియ్యం, కోడిగుడ్లు   పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా ఇదే విషయంలో పల్నాడులోని ఓ ఉపాధ్యాయుడిని విద్యాశాఖ సస్పెండ్‌ చేయడంలో అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.


గుంటూరు(విద్య), ఆగస్టు 8: జిల్లాలో 3,710 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చిలోనే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కాగా విద్యార్థులకు భోజనం బదులు బియ్యం, కోడిగుండ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అనేక పాఠశాలల్లో విద్యార్థులను తరగతుల వారీగా పిలిపించి వారికి  బియ్యం, గుడ్లు అందజేశారు. ఇందులో దాదాపు 25 నుంచి 45శాతం పాఠశాలల్లో పంపిణీ సక్రమంగా జరగలేదు. టీచర్లే విద్యార్థుల తల్లిదండ్రులకు ఒకటి రెండుసార్లు ఫోన్‌చేసి బియ్యం తీసుకెళ్ళాలని చెప్పారు. అయితే కొవిడ్‌ కారణంగా ఎక్కువమంది పాఠశాలలకు వెళ్ళలేదు. ఇదే అదనుగా పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు ఏజన్సీ నిర్వహకులు బియ్యం, గుడ్లు స్వాహా చేసి బయటకు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. రికార్డుల్లో మాత్రం విద్యార్థులకు పంపిణీ చేసినట్లుగా రాశారు. నరసరావుపేట, సత్తెనపల్లి, బాపట్ల, తెనాలి, గుంటూరు డివిజన్‌లో, నగరపాలక సంస్థ పాఠశాల్లో సైతం ఇదే స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 


ఏజన్సీ నిర్వాహకులకు ఎసరు

ఇదిలాఉంటే జిల్లాలో మధ్యాహ్న భోజన ఏజన్సీలు అధికార పార్టీ మద్దతుదారులకు కట్టబెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏజన్సీలకు గౌరవేతనంగా రూ.1000 చెల్లించేవారు. దానిని రూ.మూడు వేలకు పెంచారు. దీనిపై కన్ను వేసిన స్థానిక నేతలు ప్రస్తుతం ఉన్న ఏజన్సీలను తప్పించేందుకు పావులు కదుపుతున్నారు. రాజకీయ ఒత్తిడి కారణంగా ఇప్పటికే దాదాపు 150 నుంచి 200 ఏజన్సీలు స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అకాశం ఉందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.


ఏజన్సీలను  తప్పించడానికి ముందుగా 100మందికి పైగా విద్యార్థులున్న పాఠశాలల్ని ఎంచుకుంటున్నారు. అక్కడ ఏజన్సీ నిర్వాహకులపై రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువస్తారు. భోజనం బాగా చేయడం లేదని, కూరలు బాగాలేవని, తల్లిదండ్రులు, విద్యార్థులతో ఫిర్యాదులు ఇప్పించడం, గుడ్లు సరఫరా చేయడం లేదని హెచ్‌ఎం, తహసీల్దారు, ఎంఈవో స్థాయిలో ఫిర్యాదు చేయడం చేస్తారు. దీంతో అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి భోజన ఏజన్సీను రద్దు చేసేలా ఒత్తిడి తీసుకువస్తారు.


పట్టణాల్లో అక్షయ పాత్ర ద్వారా...

గౌరవ వేతనంతో పాటు ఒక్కో ఏజన్సీ నిర్వహకుడికి నెలకు రూ.15పైన ఆదాయం వస్తోందని సమాచారం. పాఠశాలల్లో 50 మందికి భోజనం పెట్టి 100 మందికి పెట్టినట్లు రాసుకోవడం, భోజనం చేయని విద్యార్థుల హాజరు తీసుకోవడం, గుడ్లు సరిగా పంపిణీ చేయకపోవడం ద్వారా ఈ అక్రమార్జన జరుగుతోంది.  జిల్లాలోని 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని పాఠశాలల్లో అక్షయపాత్ర ద్వారానే భోజనం సరఫరా చేసేలా ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లోని మధ్యాహ్న భోజన ఏజన్సీలు కనుమరుగు కాక తప్పదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-09T10:03:32+05:30 IST