మునిగినా..మెలికలేనా

ABN , First Publish Date - 2020-10-21T11:56:28+05:30 IST

వ్యవసాయ, ఉద్యాన పంటల రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారైంది. మొత్తం మీద 42 వేల ఎకరాలకు పైగా పసుపు, కంద, అరటి, తమలపాకు, కూరగాయ, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు దెబ్బతింటే అధికారులు మాత్రం ఒక్క గ్రామం

మునిగినా..మెలికలేనా

వరద పరిహారం పంపిణీలో ఆంక్షలు

సాయం పంపిణీకి రేషన్‌ కార్డుతో లింకు

రైస్‌ కార్డు లేని వారికి అందని నిత్యావసరాలు

వరద ముంచెత్తినా పంట నష్టం అంచనాల్లో తాత్సారం

నేటికీ పొలాల్లో అడుగు పెట్టని ప్రభుత్వ యంత్రాంగం

ఇళ్లపై ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా అధికారుల లెక్కలు


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

రెక్కల కష్ణాన్ని కృష్ణమ్మ మింగేసింది. పోటెత్తిన వరద రైతుల ఆశలను చిదిమేసింది. చేతికంది వచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. అటు పంట పోయి.. ఇటు ఇల్లు మునిగి సర్వం కోల్పోయినా సాయం అందజేయడానికి మెలికలు పెడుతున్నారని రైతులు, లంకలవాసులు వాపోతున్నారు. అందరికీ సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అందుకు సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. లక్షలు నష్టపోయిన తమను ప్రభుత్వమైనా ఆదుకుంటుందా అంటే ఇప్పటి వరకు ఆ దిశగా అంచనాలే మొదలు కాలేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మునిగిన పంటలను ఇప్పటి వరకు చూడని అధికారులు ఇక పరిహారం ఏవిధంగా ఇస్తారో అర్థం కావడంలేదని వాపోతున్నారు. ఇళ్లు.. పంటలు మునిగి అష్టకష్టాలు ఎదుర్కొన్న తమ గోడు ఆలకించేవారే కనిపించడంలేదని కృష్ణా పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


కాకిలెక్కలతో.. మమ

వ్యవసాయ, ఉద్యాన పంటల రైతుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారైంది. మొత్తం మీద 42 వేల ఎకరాలకు పైగా పసుపు, కంద, అరటి, తమలపాకు, కూరగాయ, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు దెబ్బతింటే అధికారులు మాత్రం ఒక్క గ్రామం కూడా తిరగకుండానే 10 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు కాకి లెక్కలు చూపించడం లంక గ్రామాల రైతుల ఆగ్రహానికి కారణమవుతోంది. 


రూ.12 లక్షలు పెట్టుబడి.. సాయం రూ.10 వేలు

పోతార్లంకకు చెందిన నాగేశ్వరరావు అనే రైతు గత ఏడాది తన సొంత భూమి నాలుగు ఎకరాలకు తోడు మరికొంత భూమిలో కౌలుకు సాగు చేశాడు. ఇందుకు అతడు రూ.12 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఆ సమయంలో వచ్చిన వరదల్లో పంట మొత్తం పోయింది. అయితే ప్రభుత్వం నుంచి పరిహారం కింద కేవలం రూ.10 వేలు బ్యాంకు ఖాతాలో వేశారు. ఏ విధంగా పంట నష్టం లెక్క వేశారో తెలుసుకుందామని ప్రయత్నించినా చెప్పే నాధుడు లేడని, చివరకు దక్కిందే చాలని సరిపెట్టుకున్నట్లు ఆ రైతు తెలిపారు.  


పలకరించేవారే కరువు

చుట్టూ నీటితో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తే పలకరించిన వారేలేరు. తాగడానికి గుక్కెడు నీరు కూడా ఇవ్వలేదు. కనీసం వలంటీర్లయినా కనికరిస్తారని వేడుకుంటే మా ఇళ్లు మునిగి మేమే దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే నీ గోడు నేనెక్కడ వినేదంటూ మండిపడ్డారు. వరద నీరు తగ్గాక అయినా అధికారులు వస్తారనుకుంటే అంతు లేకుండా పోయారు. ట్రాక్టర్‌ ఎక్కి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీసం కరెంటైనా ఇప్పించండని చెప్పుకోబోతే చీత్కరించుకుంటూ వెళ్లిపోయారు.. అని కృష్ణానది పరివాహాక ప్రాంతంలో వరదలకు చిక్కుకుని ఇప్పుడిప్పుడే భయట పడుతున్న గ్రామాల్లోని ప్రజల వేదన.


కృష్ణానదికి వరద వచ్చాక ప్రకాశం బ్యారేజి దిగువున ఉన్న తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని లంక గ్రామాలు ఎనిమిది రోజులుగా నీటిలోనే మునిగి ఉన్నాయి. 38 లంక గ్రామాలు, నది ఒడ్డున ఉన్న మరికొన్ని ఊర్లు వరదకు అతలాకుతలం అయ్యాయి. నేటికి చాలా చోట్ల రోడ్లు బయట పడక ముంపు నీరు బయటకు పోయేందుకు సరైన డ్రెయినేజీ లేక అందులోనే ప్రజలు రోజులు వెళ్లదీస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువున కృష్ణా తీరంలో ఉన్న ఏడు మండలాల్లో ఇప్పటి వరదలకు 42 వేల ఎకరాలకు పైగా అరటి, పసుపు, తమలపాకు, కంద వంటి వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతింటే అంచనా వేసి రెండో పంటకు మార్గం చూపాల్సిన అధికారులు తొమ్మిదో రోజు కూడా పొలాల్లో అడుగు పెట్టిన పరిస్థితులు లేవు.


పసుపు, కంద సాగుకు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.40 లక్షల వరకు ఖర్చు పెట్టారు. కౌలు రైతులైతే ఈ ఖర్చుకు అదనంగా మరో రూ.40-55 వేల వరకు కౌలు కింద చెల్లించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ-క్రాప్‌ కింద పంట నమోదు కాలేదంటూ మరికొందరు బాధిత రైతులను ఫిల్టర్‌ చేసేందుకు కూడా అధికారులు సిద్ధపడుతున్నారు. వరద ప్రభావిత లంక గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న వరద సాయం అరకొరగానే ఉందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తక్షణంగా అందించే సాయంలోను ఆంక్షలు ఏమిటని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.    నాలుగు రోజులుగా వరద నీటిలోనే అవస్థలు పడ్డామని కనీసం పట్టించుకున్నవారే లేరని పలు గ్రామాల్లోని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.  


అంచనాలు లేవు.. పరిహారము లేదు

గత సంవత్సర కాలంలో ప్రస్తుత వరదతో కలుపుకుంటే నాలుగు పర్యాయాలు వరదలు వచ్చాయి. గత సంవత్సరం వచ్చిన వరదకు ప్రస్తుతం ఏర్పడిన నష్టం తరహాలోనే పసుపు, కంద, అరటి, తమలపాకు తోటలు దెబ్బతింటే ఇంత వరకు పరిహారం అందలేదు. అప్పట్లో పంట నష్టం అంచనాలను ఆలస్యంగా వేయడంతో కొందరు రైతులు రెండో పంట అదును పోతుందనే ఆందోళనతో దెబ్బతిన్న పంటలను తొలగించి కొత్త పంట వేసుకున్నారు. ఆ సమయంలో వచ్చిన అధికారులు మీ పంట దెబ్బతిన లేదంటూ అంచనాల్లోకి ఎక్కించకుండానే వెనుదిరిగిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టాక కానీ పంట నష్టం   అంచనాలు వేసే స్థితి లేదు. ఈ పరిస్థితుల్లో అప్పటి వరకు నిరీక్షించలేమని.. రైతులు తెలుపుతున్నారు.   


మునిగితే ఇస్తామని.. మాటమార్చారు

లంక గ్రామాల్లో వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ముంపు బారిన పడిన అన్ని ఇళ్లకు పరిహారం ఇవ్వడానికి అనేక మెలికలు పెడుతున్నారు. ఇటీవల మంత్రులు సుచరిత, శ్రీరంగనాథరాజులు లంక గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా వరద ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి బియ్యం, పప్పులు అందిస్తామని, దెబ్బతినకున్నా మునిగినా ఆ ఇళ్లను కూడా మెరకలో నిర్మించుకునేందుకు కొత్తవి మంజూరు చేస్తామని ప్రకటించారు. మరో పక్క ముఖ్యమంత్రి జగన్‌ కూడా మునిగిన ప్రతి ఇంటికి సాయం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ, ఇక్కడ మాత్రం అధికారులు వారి ఆదేశాలకు విరుద్ధంగా పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తోంది. గతంలో రేషన్‌ కార్డులతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి సాయం అందించేవారు. అయితే ప్రస్తుతం వరద సాయానికి అధికారులు బియ్యం కార్డుతో ముడిపెడుతున్నారు. కార్డు ఉన్న వారికి మాత్రమే పరిహారం ఇస్తూ మిగిలిన వారికి మొండి చేయి చూపుతున్నారు. తాజాగా కొత్త బియ్యం కార్డులు మంజూరై బాధితుల చేతికి అందినా వారి పేర్లు ఆన్‌లైన్‌లో చూపించడం లేదు.


దీంతో అలాంటి వారికి కూడా ప్రభుత్వ సాయం అందడంలేదు. 25 కిలోల బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంప, పామోలిన్‌ అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తే ఒక్కో చోట ఒక్కో విధంగా కొన్నింటిని మాత్రమే ఇస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. గతంలో దెబ్బతిన్న ఇళ్ల నమోదుకు అధికారులు వరద తగ్గిన 15 రోజుల తర్వాత వచ్చారని, అప్పటి వరకు ఉండలేక బురద కడిగేసుకుంటే ఇళ్లు మునగలేదని అధికారులు తేల్చారని.. ఈ సారి కూడా అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉందని పలువురు వాపోతున్నారు.   అధికారులు పట్టించుకోవడం లేదు

వరదల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.  గత ఏడాది వచ్చిన వరదల్లో పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందలేదు.   పొలాల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. పంట రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి.

- మేరుగ వీరయ్య, పెదలంక


వరద సాయంలో ఆంక్షలు

వరదలతో అల్లాడిపోతున్నాం. ప్రభుత్వం అందించే సాయంలో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.  వరద బాధితులందరికీ సాయం అందించాల్సి ఉండగా రేషన్‌కార్డు కలిగిన వాళ్ళకే సాయం అందించి చేతులు దులుపుకుంటున్నారు.

- బుస్సా సాంబశివరావు, పెసర్లంక


పేదలకు ఏమి అందడం లేదు

రోడ్డు వెంబడి గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నా.  వరదలు వచ్చినప్పుడల్లా ఇల్లు మునిగి కట్టుబట్టలతో మిగులుతున్నాం.  దెబ్బతిన్న ఇల్లు రాసుకోవడానికి ఇంత వరకు ఎవరూ రాలేదు. ఎప్పుడో వచ్చి ఉపయోగం ఏమి ఉంది.  ఇంట్లోని బురద ఎత్తి పోయలేక శుభ్రం చేసుకోలేక చచ్చిపోతున్నాం.

- బొర్రా నాగేంద్రమ్మ, చింతమోటు


వరద వస్తుంది వెళ్ళిపోమన్నారు

వరద వస్తుంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపొమ్మన్నారు.  పునరావాస కేంద్రం ఉందని కూడా తెలియదు.  బంధువుల ఇళ్ళకు వెళ్ళి తలదాచుకున్నాం. నీరు చుట్టుముట్టడంతో ఇంటి గోడలు నాని ఒరిగిపోతున్నాయి. ఎవరూ పట్టించుకోలేదు.   దెబ్బతిన్న ఇళ్ళు నమోదు చేశామంటున్నారు.. ఎవరు.. ఎప్పుడు చేశారో తెలియదు. 

- శొంఠి ఏడుకొండలు, చింతమోటు

Updated Date - 2020-10-21T11:56:28+05:30 IST