ఇంటికే.. రేషన్!
ABN , First Publish Date - 2020-11-14T04:31:42+05:30 IST
జిల్లాలో కొత్త సంవత్సరం ప్రారంభ రోజు నుంచి రేషన్ సరుకులను ఇంటివద్దకే తీసుకెళ్లి పంపిణీ చేసే విధానానికి శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రేషన్ సరుకుల డోర్ డెలివరీకి ఏర్పాట్లు
ప్రతీ ఇంటి ఎదుట మ్యాపింగ్ చేస్తున్న వలంటీర్లు
జనవరి నుంచి అమలుకు చర్యలు
గుంటూరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్త సంవత్సరం ప్రారంభ రోజు నుంచి రేషన్ సరుకులను ఇంటివద్దకే తీసుకెళ్లి పంపిణీ చేసే విధానానికి శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని యంత్రాంగం సమకూర్చుకుంటోంది. ప్రతీ ఇంటి జియో కో-ఆర్డినేట్స్(భూఅక్షాంశాల)ని వలంటీర్లతో మ్యాపింగ్ చేయిస్తోంది. అలానే సరుకులు రవాణా చేసేందుకు వాహనాలను కూడా కొనుగోలు చేస్తోంది. డిసెంబరు నెల 15వ తేదీ లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ట్రయల్‌రన్ కూడా నిర్వహించాలని భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఒకటో తేదీ నుంచి వలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులను పంపిణీ చేసే విధానాన్ని తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. దీని వలన పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు తెర పడుతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 15 లక్షల 47 వేల 127 కుటుంబాలకు ప్రతీ నెలా రేషన్ సరుకులు సరఫరా జరుగు తున్నాయి. అయితే వీరిలో దాదాపుగా మూడు లక్షల కుటుంబాలు సరుకులు తీసుకోవడం లేదు. కాగా ఈ-పోస్‌లో లొసుగులు కారణంగా నేటికీ రేషన్ సరుకులు నల్లబజారుకు తరలిపోతూనే ఉన్నాయి. అవే రీసైక్లింగ్ జరిగి తిరిగి షాపులకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డోర్ డెలివరీ విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. 2021 జనవరి ఒకటో తేదీ నుంచి మాత్రం డోర్ డెలివరీ ద్వారానే సరుకుల పంపిణీ జరగాలని సీఎం జగన్ ఇటీవలే స్పష్టం చేశారు. ఆ మేరకు పౌరసరఫరాల సంస్థ 20, 10, 5 కేజీల ప్లాస్టిక్ సంచులను సిద్ధం చేసుకుంటోన్నది. సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని వీటిల్లో నింపి పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్ తన పరిధిలో ఉన్న ఇళ్లకు వాహనాన్ని తీసుకొస్తారు. సరిగ్గా ఇంటిముందు ఆ వాహ నాన్ని నిలిపిన తర్వాత జియో కో-ఆర్డినేట్స్ మ్యాచింగ్ అవుతాయి. అప్పుడే రేషన్ సరుకులు ఈ-పోస్‌లో విడుదల అవుతాయి.
రేషన్ డీలర్ల పరిస్థితి అగమ్యగోచరం
ఇదిలావుంటే రేషన్‌డీలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డీలర్లు మండల స్టాకిస్టులుగా ఉంటారని ప్రభుత్వం గతంలో చెప్పింది. అయితే స్టాకిస్టు లకు ఎంత అద్దె చెల్లిస్తారు, కమీషన్ తదితర వివరాలు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. దీంతో జిల్లాలోని 2,803 మంది రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. దశాబ్ధాలుగా తాము డీలర్లుగా ఉంటూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్నామంటున్నారు. అలాంటిది నేడు తమ పరిస్థితి ఏమౌతుందో అర్థం కాకుండా ఉందని వాపోతున్నారు. కాగా ప్రజల్లో నేటికీ ఈ బియ్యంపై అపోహలు నెలకొని ఉన్నాయి. సన్నబియ్యం ఇస్తారన్న అంతా అనుకుంటున్నారు. దీనిపై అధికారులని ప్రశ్నించగా నాణ్యమైన బియ్యం అని చెబుతున్నారు.