-
-
Home » Andhra Pradesh » Guntur » relaxation of sanctions
-
ఆంక్షల సడలింపుపై కసరత్తు
ABN , First Publish Date - 2020-05-18T09:34:52+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ 4.0ని ఈ నెలాఖరు తేదీ

మరోమారు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం
జిల్లాలో నేడు మార్గదర్శకాలు విడుదల చేయనున్న కలెక్టర్
కంటైన్‌మెంట్ జోన్లలో కఠినతర నిబంధనలే
బఫర్ జోన్లలో కొన్ని సడలింపులు ఇచ్చేందుకు సమాలోచనలు
కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు
గుంటూరు, మే 17 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ 4.0ని ఈ నెలాఖరు తేదీ వరకు పొడిగించిన దృష్ట్యా జిల్లాలో ఆంక్షల సడలింపుపై కసరత్తు ప్రారంభమైంది. కేంద్రం నుంచి ఆదివారం రాత్రి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గైడ్స్‌లైన్స్‌ని రూపొందించింది. ఈ రెండిటిని మూలంగా చేసుకొని సోమవారం సాయంత్రంలోపు జిల్లాకు సంబంధించి లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు కలెక్టర్ ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ప్రధానంగా కేసులు ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ని కఠినంగా అమలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్ల మండలాలను విభజించిన విషయం తెలిసిందే. వాటిల్లో కొన్ని సడలింపులు ఇచ్చేందుకు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ చర్చలు జరుపుతున్నారు.
లాక్‌డౌన్ 3.0లోనే కొన్ని ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం సడలించినప్పటికీ గుంటూరు నగరం, నరసరావుపేటలో కేసులు పెరుగుదల కొనసాగుతుండటం, జిల్లా రెడ్ డిస్ట్రిక్ట్‌గా ఉండటంతో కలెక్టర్ ఆనంద్‌కుమార్ ఎలాంటి ఆంక్షలను సడలించలేదు. కేవలం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులకు అనుమతించారు. లాక్‌డౌన్ 4.0లో మాత్రం కొన్ని ఆంక్షలను సడలించేందుకు ఆయన కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసులు నిలిచిపోయి 28రోజులు అయిన ఏరియాల్లో కంటైన్‌మెంట్ ఆపరేషన్స్‌ని విడతల వారీగా ఎత్తివేస్తారు.
బఫర్ జోన్లలో ఈ దఫా ఆంక్షల సడలింపు ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం ఐదుగంటల వరకు షాపులు అనుమతించే విషయమై చర్చలు జరుపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని బఫర్ జోన్లలో ఉదయం 11 గంటల వరకు అనుమతించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. సోమవారం సాయంత్రం లోపు మార్గదర్శకాలపై పూర్తి స్పష్టత వస్తుందని వెల్లడించాయి.