నరసరావుపేటలో ప్రమాద ఘంటికలు.. ఒక్కరోజులోనే..
ABN , First Publish Date - 2020-04-25T15:51:52+05:30 IST
నరసరావుపేటలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. శుక్రవారం ఒక్క రోజే 9 మందికి కరోనా సోకింది. పట్టణం దాటి గ్రామాలకు వైరస్ విస్తరిస్తున్నది. కరోనా బాధితుల సంఖ్య 45కు చేరింది. శుక్రవారం నమోదైన కేసులలో వరవకట్టకు

నరసరావుపేట (గుంటూరు): నరసరావుపేటలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. శుక్రవారం ఒక్క రోజే 9 మందికి కరోనా సోకింది. పట్టణం దాటి గ్రామాలకు వైరస్ విస్తరిస్తున్నది. కరోనా బాధితుల సంఖ్య 45కు చేరింది. శుక్రవారం నమోదైన కేసులలో వరవకట్టకు చెందిన ఏడుగురు, మండలంలోని అల్లూరివారిపాలేనికి చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరు పల్నాడు రోడ్డులోని ఆస్పత్రిలో పనిచేస్తారు. ముగ్గురు వైద్యులతో పాటు మొత్తం 12 మందికి ఆస్పత్రి ద్వారానే వ్యాధి సంక్రమించింది. కేసుల సంఖ్య ప్రమాదకరస్థాయిలో పెరుగుతుండటంతో అప్రమత్తమైన యంత్రాంగం పట్టణమంతా రెడ్‌అలర్ట్ ప్రకటించింది. వైరస్ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నందునే కేసుల సంఖ్య పెరిగిపోతోందని ప్రజలు వాపోతున్నారు. కరోనా తొలి కేసు, తొలి మరణం నమోదైన నాడే ప్రభుత్వం సూచించిన రీతిలో అధికారులు స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఈ స్థాయిలో కేసులు పెరిగి ఉండేవి కావంటున్నారు.
క్వారంటైన్ కేంద్రాల్లో వసతులపై అసంతృప్తి
నరసరావుపేట పరిధిలోని ఆరు క్వారంటైన్ కేంద్రాల్లో 158 మంది ఉన్నారు. ఇక్కడ వసతులపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఈసీ కేంద్రంలో ఆహారం, తాగునీరు సరిపోవడం లేదని శుక్రవారం అందోళన వ్యక్తం చేశారు. పరిశుభ్రత లేదని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఉంటే రోగాల భారిన పడతామని వాపోయారు. దీనిపై తహసీల్దారు రమణనాయక్‌ను వివరణ కోరగా గుంటూరులోని కేంద్రాల్లో అమలు చేస్తున్న మెనూతో పాటు వసతులు మెరుగు పరుస్తామన్నారు.