కొత్త బియ్యం కార్డుదారులకే రేషన్‌ సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2020-03-28T11:03:28+05:30 IST

వైఎస్‌ఆర్‌ నవశకం సర్వే అనంతరం జారీ చేస్తున్న కొత్త బియ్యం కార్డుదారులకే రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌...

కొత్త బియ్యం కార్డుదారులకే రేషన్‌ సరుకుల పంపిణీ

  • జాయింట్‌ కలెక్టర్‌ స్పష్టీకరణ

గుంటూరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ నవశకం సర్వే అనంతరం జారీ చేస్తున్న కొత్త బియ్యం కార్డుదారులకే రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ స్పష్టంచేశారు. శుక్రవారం సాయంత్రం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ నుంచి అందిన ఆదేశాల మేరకు జేసీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కొక్కరికి 5కేజీల బియ్యం, కుటుంబం మొత్తానికి కలిపి కేజీ కందిపప్పు ఉచితంగా అందజేస్తామన్నారు. ఇందుకోసం వీఆర్వోలు/గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీలు బయోమెట్రిక్‌ ఆథెంటికేషన్‌ చేస్తారు. దీనివలన కార్డుదారులు విధిగా ఈ-పోస్‌లో వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. కొత్త కార్డుల పంపిణీ ప్రక్రియ చాలావరకు జిల్లాలో జరిగింది. ఇంకా అర్హులలో కొంతమందికి కార్డులు ఇవ్వాల్సి ఉన్నది. వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డైనమిక్‌ కీ రిజిస్టర్‌లను రేషన్‌ షాపులకు పంపిస్తున్నామని, కొత్త రైస్‌ కార్డు అందుకోలేకపోయినవారు పాత కార్డు చూపిస్తే వీఆర్వో ఈపీడీఎస్‌ వెబ్‌సైట్‌లో ఆ కుటుంబానికి బియ్యం కార్డు మంజూరై ఉందో, లేదో చూస్తారు. కార్డు మంజూరైన వారికి సరుకులు సరఫరా చేస్తారు. లబ్ధిదారులు ఎక్కడైనా సరుకులు తీసుకొనేందుకు వీలుగా పోర్టబిలిటీ సౌకర్యం కూడా కల్పించినట్లు జేసీ తెలిపారు. డైనమిక్‌ కీ రిజిస్టర్‌, అనర్హుల జాబితాలను ఆయా రేషన్‌షాపులు, సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తామన్నారు. షాపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరుస్తామని, కార్డుదారులు ఒకేసారి కాకుండా విడతలవారీగా వచ్చి సరుకులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-03-28T11:03:28+05:30 IST