రేషన్ డీలర్ల సమ్మెబాట
ABN , First Publish Date - 2020-07-18T10:04:25+05:30 IST
రేషన్ డీలర్లు జిల్లాలో సమ్మె బాట పడుతున్నారు. కరోనా సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన ఏడు..

నేడు ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద ధర్నా
ప్రభుత్వం దిగి రాకపోతే మరింత ఆందోళన..
ఎనిమిదో విడత రేషన్ పంపిణీ నిలిపివేత తప్పదు
గుంటూరు, జూలై 17 (ఆంధ్రజోతి): రేషన్ డీలర్లు జిల్లాలో సమ్మె బాట పడుతున్నారు. కరోనా సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన ఏడు విడతల రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కమీషన్ చెల్లించకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. మరోవైపు డీలర్ల భద్రతని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. రెండు, మూడు విడతలు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసి ఆ తర్వాత చేతులు దులుపుకొంది. అసలే కరోనా జిల్లావ్యాప్తంగా విలయతాండవం చేస్తుండగా డీలర్లకు కనీస సౌకర్యాలు సమకూర్చకుండా ప్రమాదకర వాతావరణంలో సరుకులు పంపిణీ చేయమనడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తమ ఆవేదనని ప్రభుత్వానికి తెలిపేందుకు శనివారం ఉదయం జిల్లాలోని అన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద ధర్నా నిర్వహించి ఆతర్వాత జాయింట్ కలెక్టర్(రెవెన్యూ)కి మెమోరాండం అందజేయాలని నిర్ణయించారు. 19వ తేదీ లోపు సమస్య పరిష్కారం కాకుండా 20వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ఎనిమిదో విడత రేషన్ పంపిణీని నిలుపుదల చేస్తామని వివిధ సంఘాల నాయకులు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకురావడంతో రేషన్ డీలర్లకు ఉపాధి భద్రత పూర్తిగా కరువైపోయింది. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో మండల స్టాకిస్టులుగా నియమిస్తామనిపిల్లిమొగ్గలు వేసింది. ఇదిలావుంటే లాక్‌డౌన్‌లోనూ 2,800 మంది డీలర్లు జిల్లాలో 15 లక్షల పేద కుటుంబాలకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. వారికి న్యాయబద్ధంగా చెల్లించాల్సిన కమీషన్‌ని ప్రభుత్వం విడుదల చేయడం లేదు. మొదటి, రెండు విడతలు డీలర్లు, రేషన్‌కార్డుదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీఆర్‌వో/వార్డు సెక్రెటరీ వేలిముద్ర వేసి రేషన్ రిలీజ్ చేశారు. దీనివలన ఎలాంటి రిస్కు లేదు.
అయితే ఈ విధానంలో పంపిణీ శాతం పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తూ మళ్లీ ఈ-పోస్ వేలిముద్ర విధానాన్ని తీసుకొచ్చింది. మూడు, నాలుగు విడతల వరకు షాపులకు శానిటైజర్లు, మాస్కులు ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిగా వదిలేశారు. దాంతో డీలర్లు శానిటైజర్లు కూడా పెట్టడం లేదు. గుంటూరు నగరంలో నిత్యం కరోన కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి రేషన్‌షాపుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వేలిముద్రలు వేయడం కూడా ఒక కారణంగా ఉంటోంది. ప్రభుత్వం ఎలాంటి శానిటైజర్లు సరఫరా చేయకుండా ఈ నెల 20వ తేదీ నుంచి ఎనిమిదో విడత రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకపక్క కమీషన్ చెల్లించక, మరోవైపు తమ ప్రాణాలను గాలిలో పెడుతూ రేషన్
సరుకులు పంపిణీ చేయమంటుండటంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రతీ డీలర్‌కి రూ.25 లక్షల బీమా సదుపాయాన్ని అక్కడి ప్రభుత్వం వర్తింపు చేసిందని, ఇక్కడ ఎలాంటి బీమా కల్పించలేదని తెలిపారు. అలానే గురువారం నగరంలోని ఒక డీలర్ కరోనా బారిన పడి చనిపోయారు. వీటన్నింటిపై తాము నిరసన తెలుపుతామని, ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెలోకి దిగుతామని డీలర్లు చెప్పారు.