రేషన్.. పక్కదారి
ABN , First Publish Date - 2020-05-09T07:45:42+05:30 IST
కార్డుదారుల వేలిముద్రల అధీకృతం లేకపోవడంతో జిల్లాలో రేషన్ సరుకులు భారీగానే పక్కదారి
వేలిముద్ర తప్పనిసరితో వెలుగులోకి లెక్కలు
కరోనా తొలి రెండు విడతల్లో పంపిణీ 90 శాతంపైనే
మూడో విడతలో ఇప్పటి వరకు పంపిణీ 86.73 శాతమే
50 వేల కుటుంబాల రేషన్ పక్కదారి పట్టినట్లు అనుమానాలు
గుంటూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): కార్డుదారుల వేలిముద్రల అధీకృతం లేకపోవడంతో జిల్లాలో రేషన్ సరుకులు భారీగానే పక్కదారి పట్టినట్లు స్పష్టమౌతోన్నది. కరోనా సాయం కింద ప్రభుత్వం తొలి రెండు విడతల్లో ఈ-పోస్ యంత్రాలపై కార్డుదారుల వేలిముద్రలు అవసరం లేకుండా పంపిణీ చేసింది. దీంతో గతంలో కంటే పంపిణీ శాతం పెరగడంతో మూడో దఫా వేలిముద్రలను తప్పనిసరి చేసింది. దీంతో ఒక్కసారిగా రేషన్ పంపిణీ శాతం పడిపోయు అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 14 లక్షల 89 వేల 437 కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డులున్నాయి. వీరికి కరోనా సాయం కింద ప్రభుత్వం మూడు విడతలు గా కుటుంబంలో ప్రతీ ఒక్కరికి 5 కేజీల బియ్యం, రెండు దఫాలు కుటుంబానికి కేజీ వంతున కందిపప్పు, ఒక దఫా కేజీ శనగలు పంపిణీ చేసింది. ఈ-పోస్ యంత్రాలపై వేలిముద్రలు వేయడం వల్ల వైరస్ వ్యాప్తి ప్రబలే ముప్పు ఉందని భావించిన ప్రభుత్వం తొలి రెండు విడతలు కార్డుదారుల వేలిముద్రలు అవసరం లేదని చెప్పింది. దీంతో ఒక్కసారిగా పంపిణీ శాతం పెరిగింది.
సహజంగా జిల్లాలో ఏ నెల చూసుకొన్నా రేషన్ సరుకులని 85 నుంచి 87 శాతం కుటుంబాలు మాత్రమే తీసుకుంటాయి. అలాంటిది మార్చి నెలాఖరు నుంచి ఇచ్చిన తొలి విడతలో 13 లక్షల 50 వేల 255(90.65 శాతం) మంది తీసుకొన్నారు. అలానే ఏప్రిల్ నెల మధ్య నుంచి ఇచ్చిన రెండో విడతలో 13,71,420(92.07 శాతం) మంది తీసుకున్నారు. గతంతో పోల్చుకొంటే ఆ రెండు నెలల్లో సగటున 60 వేల కార్డులకు పైగా రేషన్ సరుకుల పంపిణీ జరిగింది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ గుర్తించారు. మరోవైపు పలుచోట్ల రేషన్ బియ్యం పక్కదారి పడుతోండగా విజిలెన్స్, పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడో ఏదో జరుగుతుందని భావించిన కమిషనర్ మూడో విడత వచ్చేసరికి కొన్ని జాగ్రాత్తలతో వేలిముద్ర తప్పనిసరి చేశారు.
తొలుత దీనిని రేషన్‌డీలర్లు వ్యతిరేకించారు. అయితే పౌరసరఫరాల శాఖ వెనకడుగు వేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ-పోస్ ద్వారానే మూడో విడత సరుకులు పంపిణీ చేపట్టారు. మరో మూడు రోజుల్లో సరుకుల పంపిణీ ముగియనుంది. ఇప్పటివరకు 12 లక్షల 91 వేల 890 కుటుంబాలు సరుకులు తీసుకోవడంతో పంపిణీ శాతం 86.73గా ఉన్నది. ఈ రెండు రోజుల్లో మహా అయితే పంపిణీ సంఖ్య 13 లక్షలకు చేరుకుంటుందని, దీనిని పరిగణనలోకి తీసుకొంటే గత రెండు నెలలు సగటున 50 వేల కుటుంబాలకు అదనంగా బియ్యం, కందిపప్పు/శనగల పంపిణీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఇందుకు ప్రధాన కారణం కొంతమంది చనిపోయిన వారి కార్డులు, అసలు రేషన్ తీసుకోవడానికి రాని వారి కార్డుల నెంబర్లు కూడా ఈ-పోస్‌లో నమోదు చేసి సరుకులు పక్కదారి పట్టించి ఉంటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి.