వేగంగా.. కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-04-14T09:34:15+05:30 IST

ర్యాపిడ్‌ టెస్టింగ్‌ అందుబాటులోకి రావడంతో జిల్లాలో కరోనా వైద్య పరీక్షలు వేగవంతం కానున్నాయి. ఇప్పటి వరకు రోజుకు 90 కేసులకు మాత్రమే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

వేగంగా.. కరోనా పరీక్షలు

గుంటూరు, ఏప్రిల్‌ 13 : ర్యాపిడ్‌ టెస్టింగ్‌ అందుబాటులోకి రావడంతో జిల్లాలో కరోనా వైద్య పరీక్షలు వేగవంతం కానున్నాయి. ఇప్పటి వరకు రోజుకు 90 కేసులకు మాత్రమే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ విధానంతో గంటకు వంద నమూనాలు పరీక్షించే అవకాశం వచ్చింది. సాంకేతికంగా వంద పరీక్షలు చేయకపోయినా కనీసం 50 పరీక్షలను సులువుగా పూర్తి చేయవచ్చని అధికారులు తెలుపుతుతున్నారు.


రోజుకు అంటే 24 గంటల వ్యవధిలో ఎంత తక్కువైనా 800 నుంచి వెయ్యి మధ్యలో నమూనాలకు పరీక్షలు నిర్వహించే వీలుంది. ఇప్పటి వరకు క్వారంటైన్‌లో సుమారు వెయ్యి మంది వరకు ఉన్నారు. వారందరికీ ఒకటి రెండు రోజుల్లోనే పరీక్షలు పూర్తికానున్నాయి. ఈ లోపు క్వారంటైన్‌కు వచ్చే వారికి కూడా పరీక్షలు పూర్తి చేస్తే మొత్తం మీద మూడు రోజుల్లో క్వారంటైన్‌లో ఉన్నవారందరికీ పరీక్షలు పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ఆ తరువాత నుంచి రెడ్‌జోన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని భావిస్తున్నారు. రెడ్‌జోన్‌ ఏరియాలో ఇంటింటికి నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. 


40 అంబులెన్స్‌లలో అనుమానితుల తరలింపు

గుంటూరులో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతేవేగంగా చర్యలు ప్రారంభించింది. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌, అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ రామకృష్ణ, డీఎంహెచ్‌వో యాస్మిన్‌లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. రవాణాశాఖ అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున అంబులెన్స్‌లను రంగంలోకి దింపారు.


ప్రస్తుతం సుమారు 40 అంబులెన్స్‌లలో కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నాయి.  పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబాన్ని ఆ తరువాత వారు చెప్పిన సమాచారంతో పాటు క్షేత్ర స్థాయిలో అధికారులు గుర్తించిన జాబితా ప్రకారం అనుమానితులను ఆయా అంబులెన్స్‌లలో క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటలు దాటే వరకు కూడా వారి తరలింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విధంగా గడిచిన మూడు రోజుల్లో సుమారు 750 మందిని క్వారంటైన్‌కు తరలించారు. నగర పరిధిలో 10 ఇంజనీరింగ్‌, విద్యాసంస్థల్లో క్వారంటైన్లను అందుబాటులో ఉంచారు. అక్కడ 1100 బెడ్లు అందుబాటులో ఉన్నాయి.  

Updated Date - 2020-04-14T09:34:15+05:30 IST