రైతులను మోసం చేసిన ఘనత జగన్‌దే..

ABN , First Publish Date - 2020-12-02T05:17:53+05:30 IST

రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని రాజధాని రైతులు, మహిళ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులను మోసం చేసిన ఘనత జగన్‌దే..
పెదపరిమిలో ఆందోళన చేస్తున్న రైతులు, మహిళలు

మూడు ముక్కలాటతో అమరావతి నాశనం

350వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతుల ఆగ్రహం

తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి,  తాడి కొండ, డిసెంబరు 1: రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని రాజధాని రైతులు, మహిళ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కోసం వారు చేస్తోన్న ఆందోళనలు మం గళవారంతో 350 రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతికి 30 వేల ఎకరాలు కావాలి,  అది కూడా విజయవాడ గుంటూరు మధ్య  ఉండాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్‌ అన్న మాటలను గుర్తు చేశారు. మాట తప్పను మడం తిప్పను అన్న జగన్‌ నేడు అన్నీ తప్పాడన్నారు. అమరావతిని నిర్వీర్యం చేసి,  మూడు ముక్కల ఆట మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమున్నప్పుడు అమరావతి,  లేక పోతే జగన్‌ ప్యాకేజీతో  మూడు రాజధానుల పాట పాడుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా కాగడాలు, కొవ్వొత్తులు వెలిగించి మందడం శిబిరంలో నిరసనలు తెలిపారు. పోలీసులు మోహరించినా రాత్రి కాగడాలతో రైతులు, మహిళలు నినాదాలు చేశారు.


మందడం శిబిరం వద్ద ఉద్రిక్తత

అసెంబ్లీ సమావేశాల రెండో రోజు మందడం రైతు శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతులు, మహిళలు సీఎం కనిపించడం లేదంటూ శిబిరం నుంచే చేతులతో కళ్లు పెద్దగా చేసి చూస్తూ నిరసన తెలిపారు. సీఎం వచ్చే ప్రతిసారి పోలీసులు కర్య్ఫూ  ఏర్పాటు చేస్తున్నారంటూ మండిపడ్డారు. శిబిరం నుంచి, ఇళ్ల నుంచి  బయటకు రావద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారన్నారు.  ఇటువంటి పాలన ఎక్కడా లేదని వాపోయారు. మందడం శిబిరంలో మంత్రి కొడాలి నాని దిష్ట బొమ్మను ఉంచారు. శిబిరం వద్ద మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను ఉంచే విషయమై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు సొంత స్థలంలోని శిబిరం వద్ద దిష్టిబొమ్మ పెట్టుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. పెయిడ్‌ ఆర్టిస్టులున్న మూడు రాజధానుల శిబిరం ముందున్న దిష్టిబొమ్మలు ఎందుకు తీయించరని ప్రశ్నించారు. శిబిరం తీసివేయాలని పోలీ సులు సూచించగా రైతులు, మహిళలు నిరాకరించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 144 సెక్షన్‌ అంటూ శిబిరాన్ని ఖాళీ చేయించి సీఎం మెప్పు పొందడానికి పోలీసులు పని చేస్తున్నారని మహిళలు మండిపడ్డారు.  

  - తాడేపల్లి మండలం పెనుమాక, మం గళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్ర బాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో జరుగుతున్న దీక్షలు 350వరోజుకు చేరుకున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండ లం పొన్నెకల్లు, మోతడక గ్రామంలో రైతులు, మహిళలు మంగళవారం నిరస నలు కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయా శిబిరాల్లో పలువురు మాట్లాడుతూ రైతుల ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులు 350 రోజుల నుంచి రాజధాని కోసం పొరాటం చేస్తుం టే ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నిం చారు. మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడానికి మూడు రాజధానుల ప్రకటన చేశారన్నారు. కార్తీక మాసం సందర్భంగా మోతడక శిబిరం వద్ద మహిళలు శివ దీపారాధన చేశారు. అమరావతి జేఏసీ నాయకులు మన్నవ వెంకటరామయ్య, అన్నపూర్ణ, శారదాదేవి, కొలికపూడి శ్రీని వాసరావు, విటల్‌, రాయపాటి శైలజ, మల్లికార్జున, తుళ్లూరు, అనంతవరం, పెదపరిమిల నుంచి  రైతులు, మహిళలు ఈ కార్యక్రమంలో పొల్గొన్నారు.


Updated Date - 2020-12-02T05:17:53+05:30 IST