వరి.. హరీ!

ABN , First Publish Date - 2020-11-13T06:09:24+05:30 IST

అకాల వర్షాలతో వరి పైరు నేలవాలుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షానికి కొల్లూరు మండలంలోని మాగాణి భూముల్లో వరి పైరు నేలవాలింది.

వరి.. హరీ!
కర్లపాలెం మండలం నర్రావారిపాలెంలో నీటిలో నానుతున్న వరిపైరును చూపుతున్న రైతు,

రైతులపై దెబ్బ మీద దెబ్బ

కోత దశలో కలవరపెడుతున్న అల్పపీడనం 

గాలి తీవ్రతతో నేలవాలిన ముదురు పైర్లు

వర్షానికి కొన్నిచోట్ల నీటిలో తేలియాడుతున్న పంట

డెల్టా ప్రాంత అన్నదాతల్లో ఆందోళన


 అకాల వర్షం రైతులను కలవరపెడుతోంది. అమావాస్య వెళ్లగానే వరి కోత కోయాలనుకుంటున్న రైతులకు పైరు వాలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముదురు పైర్లు నేలవాలి గింజలు మొలకెత్తుతాయని, లేత పైర్లు పనికిరాకుండా పోతాయని చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చేస్తున్న హెచ్చరికలతో రైతాంగం భయాందోళన చెందుతున్నారు. 


బాపట్ల, కొల్లూరు, భట్టిప్రోలు, దుగ్గిరాల, నవంబరు 12:  అకాల వర్షాలతో వరి పైరు నేలవాలుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షానికి కొల్లూరు మండలంలోని మాగాణి భూముల్లో వరి పైరు నేలవాలింది. అమావాస్య వెళ్లగానే కోత కోయించేందుకు సిద్ధపడిన రైతులకు అకాల వర్షాల వల్ల పైరు వాలిపోవడం, వర్షపు నీటిలో నానడంతో గింజలు మొలకెత్తి దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలతో పలు చోట్ల వరి పైరు పడిపోవడం, రైతులు దానిని నిలబెట్టి కూలీలతో కట్లు కట్టించారు. మళ్లీ అల్పపీడనంతో రెండు రోజులు అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో పంట చేతికి వస్తుందో రాదోననే బెంగతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. భట్టిప్రోలు మండలంలో బుధవారం రాత్రి కురిసిన వర్షం ఈదురు గాలులకు పలు గ్రామాల్లో వరిపంట నేలవాలింది. భారీ వర్షాలు కురిస్తే పూర్తిగా పంట మొత్తం నేలవాలిపోతుందని రైతులు తెలిపారు. దుగ్గిరాల మండలంలో గురువారం మధ్యాహ్నం వీచిన గాలి, వర్షానికి వరిపంట పలుచోట్ల నేలకొరిగింది. దుగ్గిరాల - మోరంపూడి మధ్యనున్న సుమారు 50ఎకరాల వరిపంట నేలకొరిగి వర్షపునీట తేలియాడింది. బాపట్ల మండలంలో గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం 4గంటలు వరకు కురిసిన అకాల వర్షానికి మండలంలోని వరిపంట నేలవాలింది. మండలంలోని పూండ్ల, అప్పికట్ల, గోపాలపురం, అడవి-1, ఈస్ట్‌బాపట్ల, కొండుభొట్లవారిపాలెం, జమ్ములపాలెం-1, 2, మూలపాలెం, జిల్లెళ్ళమూడి గ్రామాల్లో సుమారుగా 3,100 ఎకరాల వరి పైరు నేలవాలిందని వ్యవసాయశాఖాధికారి శారద తెలిపారు. కర్లపాలెం మండలంలో 20 పంచాయతీల పరిధిలోని పొలాలు పంటదశకు వచ్చాయి. ఇవన్నీ వర్షానికి నీటమునిగాయి. పిట్టలవానిపాలెం మండలంలోని కోమలి, సంగుపాలెం కోడూరు గ్రామాల్లో అకాల వర్షానికి అక్కడక్కడ పైర్లు నేలవాలాయి.  

Updated Date - 2020-11-13T06:09:24+05:30 IST