తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-03-23T08:12:42+05:30 IST

కరోనా వైరస్‌పై కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్స్‌ పెడుతూ వదంతులు ప్రచారం చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తప్పవని...

తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

  • అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ రామకృష్ణ హెచ్చరిక


గుంటూరు, మార్చి 22: కరోనా వైరస్‌పై కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్స్‌ పెడుతూ వదంతులు ప్రచారం చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తప్పవని అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ రామకృష్ణ హెచ్చరించారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం ఆయన తన కార్యాలయం నుంచి అర్బన్‌ పరిధిలో పరిస్ధితులను, విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగ్స్‌, రాతలు, లేనిపోని వదంతులు వ్యాప్తి చేస్తూ అలజడి సృష్టిస్తున్నారన్నారు. వారు ఎవరైనప్పటికీ సహించేది లేదన్నారు. క్వారంటైన్‌ పిరియడ్‌లో ఐసోలేషన్‌లో ఉండాల్సిన వారు కానీ అధికారులు ఇచ్చిన సూచనలు పాటించకుండా బయట సంచరిస్తే వారిపై ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు.  

ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు స్వీయ కట్టడి పాటించి పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ రామకృష్ణ అభినందనలు తెలిపారు. అదే విధంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి రోడ్లపై ఉండి విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర విభాగాల యంత్రాంగానికి డీఐజీ రామకృష్ణ అభినందనలు తెలిపారు. 

31 వరకు మాల్స్‌, సినిమా హాళ్లు, బార్లు బంద్‌

కరోనా వైరస్‌తో ఈ నెల 31 వరకు అర్బన్‌ జిల్లా పరిధిలో షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్ళు, బార్‌లు, విద్యాసంస్ధలు మూసివేయాలని డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకు రావాలని చెప్పారు. అవసర సమయాల్లో మాత్రమే వాహనాలు బయటకు తీయాలన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు తదితర నిరసన కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకోవాలని చెప్పారు. కంట్రోల్‌ రూమ్‌లో పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని, ఎటువంటి సమాచారాన్నైనా డయల్‌ 100 ద్వారా తెలపవచ్చని సూచించారు. 


నేడు పట్టాభిపురం పరిధిలో మాక్‌ డ్రిల్‌

కరోనా వైరస్‌ వ్యాప్తి నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం మధ్యాహ్నం 2 గంటల తరువాత పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు తెలియజేస్తూ మాక్‌ డ్రిల్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


Updated Date - 2020-03-23T08:12:42+05:30 IST