పన్నుల్లో పురోగతి
ABN , First Publish Date - 2020-09-14T08:56:05+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంచుమించు ఆరు నెలల నుంచి జిల్లాలో ప్రజలు ఇబ్బంది పడుతోన్నా పట్టణ ..
కరోనా కష్టాల్లోనూ ఆస్తిపన్ను చెల్లింపు
గత ఏడాదితో పోలిస్తే 15.95 శాతం వృద్ధి
గుంటూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంచుమించు ఆరు నెలల నుంచి జిల్లాలో ప్రజలు ఇబ్బంది పడుతోన్నా పట్టణ ప్రాంతాల్లో నివాసితులు ఆస్తిపన్ను చెల్లింపులో ముందున్నారు. గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే అన్ని పట్టణాల్లోనూ ప్రజలు పన్నులు చెల్లించి స్థానిక సంస్థలకు సహకరిస్తోన్నారు. అన్ని మునిసిపాలిటీలు కలిపి అర్ధ సంవత్సరానికి జిల్లాలో ఆస్తిపన్ను డిమాండ్ రూ. 161.47 కోట్లు కాగా ఇప్పటివరకు రూ. 79.92 కోట్లు చెల్లించారు. గత ఏడాది ఇదే సమయానికి కేవలం రూ.68.93 కోట్లు మాత్రమే వసూలైంది. దీంతో జిల్లాలో వృద్ధి శాతం 15.95గా నమోదైంది. ఈ నెలాఖరుతో అర్ధ సంవత్సరం ముగియనుంది. చివరి రెండు వారాల్లో పన్నులు చెల్లించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ దృష్ట్యా ఈ నెలాఖరుకు పన్ను వసూళ్ల శాతం మరింతగా పెరిగే అవకాశం ఉందని మునిసిపల్ పరిపాలన వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
మార్చి నెల చివరి వారంలో కరోనా వైరస్ వ్యాప్తి జిల్లాలో ప్రారంభమైంది. అప్పటి నుంచి మే నెలాఖరు వరకు లాక్‌డౌన్ కొనసాగింది. ఆ సమయంలో నిత్యావసరాల కొనుగోళ్లకు మాత్రమే అనుమతించారు. కంటైన్‌మెంట్ జోన్లలో ప్రజలను బయటకు రాకుండా కట్టడి చేశారు. జూన్ నెల నుంచి అన్‌లాక్ ప్రారంభమైనా గత నెలాఖరు వరకు కూడా ఆంక్షల సడలింపు పెద్దగా ఇవ్వలేదు. దీంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. పలువురు జీవనోపాధి కోల్పోయారు. ప్రైవేటు సంస్థల్లో పని చేసే సిబ్బందికి కూడా ఉద్యోగాలు సరిగా అందలేదు. అయినప్పటికీ ఆస్తిపన్ను చెల్లింపులో తమ బాధ్యతను ప్రజలు సక్రమంగా నిర్వర్తిస్తోన్నారు. ఈ కారణంగానే ఆయా మునిసిపాలిటీలు వివిధ పనులు చేపట్టగలుగుతోన్నాయి.
పన్ను డిమాండ్.. వసూళ్ల శాతం ఇలా..
సెప్టెంబరు 13వ తేదీ నాటికి గుంటూరు నగరంలో రూ.108.35 కోట్లు డిమాండ్ కాగా రూ.45.45 కోట్లను వసూలు చేశారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే 9.10 శాతం వృద్ధి సాధించింది.
తెనాలి మునిసిపాలిటీ రూ.10.51 కోట్లకు రూ.7.43 కోట్లు, మంగళగిరి మునిసిపాలిటీ రూ.5.26 కోట్లకు రూ.3.79 కోట్లు, నరసరావుపేట పురపాలక సంఘం రూ.8.52 కోట్లకు రూ.3.54 కోట్లు, తాడేపల్లి రూ.4.55 కోట్లకు రూ.3.40 కోట్లు, చిలకలూరిపేట రూ.4 కోట్లకు రూ.2.80 కోట్లు, బాపట్ల రూ.4.99 కోట్లకు రూ.2.50 కోట్లు, పొన్నూరు రూ.2.29 కోట్లకు రూ.2.07 కోట్లు, సత్తెనపల్లి రూ. 4.22 కోట్లకు రూ.2.04 కోట్లు, రేపల్లె రూ.2.35 కోట్లకు రూ.1.86 కోట్లు, విననుకొండ రూ.1.61 కోట్లకు రూ.1.85 కోట్లు, పిడుగురాళ్ల రూ.2.10 కోట్లకు రూ.1.78 కోట్లు, మాచర్ల రూ.2.73 కోట్లకు రూ. 1.42 కోట్లను వసూలు చేయగలిగాయి.