కరెంటు బిల్లుల షాక్.. గత నెలలో బిల్లు చెల్లించినా..

ABN , First Publish Date - 2020-05-09T17:19:04+05:30 IST

ఓ వైపు కరోనా వైరస్‌తో అల్లాడిపోతున్న ప్రజలు తాజాగా విద్యుత్‌ బిల్లుల షాక్‌తో విలవిల్లాడుతున్నారు. లాక్‌డౌన్‌ నుంచి తేరుకోకముందే ప్రజల నుంచి పెనాల్టీ సహా ముక్కుపిండి మరీ విద్యుత్‌ బిల్లులు వసూలు చేస్తున్నారు. తాజాగా వస్తున్న బిల్లులు చూసి ప్రజలు ఒక్కసారిగా నోరెళ్ళబెట్టాల్సి వస్తోంది.

కరెంటు బిల్లుల షాక్.. గత నెలలో బిల్లు చెల్లించినా..

బిల్లుల్లో తేడాతో వినియోగదారుల గగ్గోలు

కరోనా విపత్తులోనూ పెనాల్టీల బాదుడు

గుంటూరు (ఆంధ్రజ్యోతి): ఓ వైపు కరోనా వైరస్‌తో అల్లాడిపోతున్న ప్రజలు తాజాగా విద్యుత్‌ బిల్లుల షాక్‌తో విలవిల్లాడుతున్నారు. లాక్‌డౌన్‌ నుంచి తేరుకోకముందే ప్రజల నుంచి పెనాల్టీ సహా ముక్కుపిండి మరీ విద్యుత్‌ బిల్లులు వసూలు చేస్తున్నారు.  తాజాగా వస్తున్న బిల్లులు చూసి ప్రజలు ఒక్కసారిగా నోరెళ్ళబెట్టాల్సి వస్తోంది. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఫిబ్రవరిలో చెల్లించిన విద్యుత్‌ బిల్లు మొత్తాన్ని మార్చి నెలలో కూడా చెల్లించాలని అధికారులు ప్రకటించారు. తాజాగా విద్యుత్‌ మీటర్ల రీడింగ్‌ ఈనెల నుంచి ప్రారంభించారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వినియోగించిన యూనిట్లను 61 రోజులకు లెక్కించి, వాటిలో సగం యూనిట్లను అంటే మార్చి నెల వినియోగానికి పాత టారిఫ్‌ ప్రకారం, మరో సగం యూనిట్లను ఏప్రిల్‌  కొత్త టారిఫ్‌ ప్రకారం లెక్కించి మొత్తం ఒకే బిల్లుగా రూపొందించారు. 


ఇందులో ఏప్రిల్‌ నెలలో చెల్లించిన బిల్లు మొత్తాన్ని తీసి మిగిలిన నగదు చెల్లించేలా బిల్లు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మరో మతలబు ఏంటంటే ముందస్తు సమాచారం తెలియని సామాన్య ప్రజలు గత ఏప్రిల్‌ నెలలో చెల్లించని వినియోగదారులకు పెనాల్టీతో పాటు రీ కనెక్షన్‌ ఫీజుతో రూ.100 అదనపు బాదుడు బాదుతున్నారు. కనెక్షన్‌ తొలగించిందీ లేదు.. రీ కనెక్షన్‌ చేసిందీ లేదు బిల్లు సకాలంలో చెల్లించకపోవటంతో అదనంగా మరో రూ.100 చెల్లించాల్సిందే.  ఏప్రిల్‌లో చెల్లించిన బిల్లుకు సరిపడా యూనిట్లను తొలగించి మిగిలిన యూనిట్లను రెండు నెలలకు లెక్కిస్తే సరిపోతుంది కదా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. బిల్లు చెల్లించినప్పటికీ ఆ యూనిట్లను కూడా రెండునెలలు కలపటంతో శ్లాబ్‌ పెరిగే అవకాశం ఉంటుందని వాదిస్తున్నారు. కరోనా విపత్తుతో ప్రజలు ఇళ్ళకే పరిమితమైన సమయంలో విద్యుత్‌ బిల్లుల షాక్‌తో తలలు పట్టుకుంటున్నారు. 


మార్గదర్శకాలకు అనుగుణంగానే..: విజయకుమార్‌, ఎస్‌ఈ 

ఏపీసీపీ డీసీఎల్‌, విద్యుత్‌ నియంత్రణ మండలి మార్గ దర్శకాలకు అనుగుణంగానే విద్యుత్‌ బిల్లులు అందించటం జరుగుతుంది. మారి, ఏప్రిల్‌ నెలల బిల్లుల్లో మార్చి నెలకు సంబందించి పాత టారిఫ్‌, ఏప్రిల్‌ నెలకు సంబంధించి కొత్త టారిఫ్‌ ప్రకారం బిల్లులు రూపొందిస్తున్నాం. విద్యుత్‌ బిల్లుల రీడింగ్‌కు కూడా కరోనా వైరస్‌ నేపథ్యంలో కొందరు ఇళ్ళలోకి రానివ్వటం లేదు. లాక్‌డౌన్‌తో గృహావసర విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది. బిల్లుల్లో ఎటువంటి అవకతవకలు ఉండవు.

Updated Date - 2020-05-09T17:19:04+05:30 IST