సాగు..సంక్షోభమే

ABN , First Publish Date - 2020-05-13T09:34:47+05:30 IST

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే సాగర్‌ ఆయకట్టులో సాగు సమస్య తలెత్తనున్నది.

సాగు..సంక్షోభమే

పోతిరెడ్డిపాడును పెంచితే సాగర్‌ ఆయకట్‌ 

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తలెత్తనున్న నీటి సమస్య

మేల్కోని ఇరు జిల్లా ప్రజాప్రతినిధులు.. ఆందోళనలో అన్నదాతలు 


సాగర్‌లో.. ఇక సాగు సమస్యే. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సాగర్‌ ఆయకట్టు ప్రయోజనాలకు భంగకరమే. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నాగార్జున సాగర్‌ ఆయకట్టులో సాగు నీటి సంక్షోభం తలెత్తనున్నది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి శ్రీశైలం నుంచి నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి నీటి విడుదల తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ముంచుకు రానున్న సాగు, తాగు నీటి ముప్పు విషయంలో ప్రజాప్రతినిధులు మేల్కోని తమకు న్యాయం చేయాలని రైతులు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.  


నరసరావుపేట, మే 12: పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే సాగర్‌ ఆయకట్టులో సాగు సమస్య తలెత్తనున్నది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం నిండితేనే సాగర్‌కి నీటిని విడుదల చేస్తున్నారు. పదేళ్ళకు ఒక సారి భారీ వరద నీరు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాలకు వస్తున్నది. తదుపరి వరదలు అంతగా రాక పోతుండటంతో సాగు, తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నీటి సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఈ మేరకు కార్యాచరణను రూపొందించింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచటంతో పాటు శ్రీశైలం నుంచి నీటి విడుదలపై ఉత్తర్వులు ఆనాటి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాప్రతినిఽధలు, రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అప్పట్లో శ్రీశైల జలాశయంలో నీటి మట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు విడుదల చేసే విధంగా జీవో విడుదల చేశారు.


దీంతో సాగర్‌ ఆయకట్టుకు కొంత మేర నష్టం వాటిల్లుతూనే ఉంది. ఇప్పుడు 80వేల క్యూసెక్కులకు సామర్థ్యాన్ని పెంచటంతో పాటు శ్రీశైలం జలాశయంలో 834 అడుగుల నీటి మట్టం ఉంటే రాయలసీమకు నీటిని తరలించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొన్నది. గుంటూరు జిల్లాలో 6.60 లక్షలు, ప్రకాశం జిల్లాలో 4.43 లక్షల ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. గత ఖరీఫ్‌ మినహా అంతక ముందు వరుసగా మూడేళ్ళు సాగు నీటి కరువుతో పంటలు పండించుకోలేక రైతులు ఇబ్బందులు పడిన విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ తాజా నిర్ణయం రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.


గోదావరి జలాల తరలింపు ఊసేది? 

గోదావరి జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్‌ కుడి కాలువకు తరలించాలని గత ప్రభుత్వం నిర్ణయించి పనులు ప్రారంభించి నిధులు కేటాయించింది. గోదావరి జలాలను సాగర్‌ ఆయకట్టుకు ఇచ్చి కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలని నిర్ణయించినప్పటికీ గోదావరి జలాల ఎత్తి పోతల పథకం కార్యరూపం దాల్చక పోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నికర జలాలను కృష్ణా డెల్టా తదుపరి ఆయకట్టుకు వినియోగించుకున్న అనంతరమే మిగులు జలాలను రాయలసీమకు తరలించాలి. ఇందుకు విరుద్ధంగా గోదావరి జలాల ఎత్తిపోతల పథకం పూర్తి చేయక ముందే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచటం సాగర్‌ ఆయకట్టు ప్రయోజనాలకు గండి కొట్టడమే అవుతుందని రైతులు, సాగునీటి రంగ నిపుణులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజాప్రతినిధులు ప్రయోజనాలను కాపాడాలని సాగర్‌ ఆయకట్టు రైతులు కోరుతున్నారు.  

Read more