పోరాడితేనే పరిహారం దక్కేది
ABN , First Publish Date - 2020-12-17T06:21:25+05:30 IST
అప్పులుచేసి పంటలు నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతుంటే, వారిని ఆదుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి దొంగమాటలతో సరిపెట్టి, స్వప్రయోజనాలకోసం ఢిల్లీకి పరుగులు పెట్టటం దారుణమని, రైతును, వారి కుటుంబాలను కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు మట్టిలో కలసిపోయిన చరిత్రను గుర్తుచేసుకోవాలని పలువురు నేతలు మండిపడ్డారు.
రైతన్నను రోడ్డున పడేస్తున్న జగన్ సర్కారు
ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం సొంత ప్రయోజనాలకోసం ఢిల్లీకి
రైతు, కౌలు రైతులకు న్యాయం జరిగేవరకు టీడీపీ పోరాటం
పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రుల స్పష్టీకరణ
తెనాలి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అప్పులుచేసి పంటలు నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతుంటే, వారిని ఆదుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి దొంగమాటలతో సరిపెట్టి, స్వప్రయోజనాలకోసం ఢిల్లీకి పరుగులు పెట్టటం దారుణమని, రైతును, వారి కుటుంబాలను కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు మట్టిలో కలసిపోయిన చరిత్రను గుర్తుచేసుకోవాలని పలువురు నేతలు మండిపడ్డారు. రోడ్కెక్కి పోరాడితేనే న్యాయం జరుగుతుందని, రైతులు పోరాటానికి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. నివర్ తుపాన్ దెబ్బకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ’రైతుకోసం దీక్ష’ కార్యక్రమాన్ని మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు తెనాలిలో బుధవారం చేపట్టారు. స్థానిక మార్కెట్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో వీరితోపాటు తెనాలి, వేమూరు నియోజకవర్గాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ దీక్షకు మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మరికొందరు నేతలు మద్దతు పలికారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తాడేపల్లి రాజప్రాసాదంలో నిద్రపోతున్న ముఖ్యమంత్రికి మెలకువ రావాలంటే రైతులు రోడ్డెక్కక తప్పదని, రూ. కోట్ల పెట్టుబడులు పోగొట్టుకునికూడా వారిచ్చే పరిహారం విదిలింపుల కోసం రైతులు పోరాటాలకు దిగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి కాళ్లబేరం కోసం వెళ్లారని, తన హనీమూన్ గడువు ముగిసిపోయి, త్వరలో బొమ్మ ఆడుద్దనే భయంతో ఢిల్లీకి పరుగులు పెడుతున్నాడని, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నీ ఉండికూడా స్వతంత్ర ప్రతిపత్తికోసం వెళితే, ఈయన మాత్రం సొంత పనులు చక్కబెట్టుకునేందుకే వెళ్లారని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ పంట నష్టం వెంటనే ఇవ్వాలని, ఎకరాకు రూ. 15వేలు ఇవ్వాలని కోరుతూ సీఎంకు లేఖ రాస్తే తనను మంత్రులు కొందరు బండబూతులు తిట్టారని, అదే వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో ఆందోళనలుచేస్తే ఒక్క కేసుకూడా పెట్టలేదని, ఇటువంటి నియంత సీఎం మన పాలిటపడ్డాడని, పీడ వదిలించుకోటానికి రైతులు రోడ్డెక్కి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు బేడీలు వేసిన జగన్ సంస్కృతిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని, ఇంతటి నియంత మరొకరు లేరన్నారు. 2017-18లో కృషికార్ అవార్డ్ పొందిన ఆంధ్రప్రదేశ్‌ను దిక్కులేని రాష్ట్రం చేశారని, రైతు పాలసీలన్నీ చంపేసి, పనికిరాని వాటితో రైతుల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రైతు ఉసురు పోసుకున్నవారు, రైతు కుంటుంబాలను కన్నీరు పెట్టించిన వారు మట్టిలో కలిసిపోయిన సందర్భాలున్నట్టు చరిత్ర చెబుతోందని, రానున్న రోజుల్లో జగన్ మోహనరెడ్డికికూడా ఇదే గతి పడుతుందన్నారు. తడిచిన ధాన్యం కొంటామని, 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలనే లక్ష్యంతో ఉన్నామని, చివరకు ఒక్క గింజకూడా జిల్లాలో కొనలేదని, రైతులు మాత్రం వీరి మోసపు మాటలకు ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ సీఎంగా అనేక మోసాలు, ఘోరాలకు పాల్పడ్డారని, అయితే తమ ప్రభుత్వ హయాంలో గౌరవం పొందిన ఐ.ఎ.ఎస్‌లు, ఐ.పి.ఎస్‌లు నేడు జనం నుంచి ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారని, ఇటువంటి నియంత పాలన సాగించిన జగన్ ఒక్కసారి సీఎంగానే మిగిలిపోతారని ఎద్దేవ చేశారు. పంట నష్టం జరగకముందు చెల్లించాల్సిర భీమా ప్రీమియం ఎవరైనా నష్టం వచ్చాక కడతారా! ఆమాత్రం జ్ఞానంకూడా లేనివాడు ముఖ్యమంత్రి అయితే అన్నదాత పరిస్థితి దారుణమే అవుతుందన్నారు.
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రైతులకు మేలు చేస్తున్నట్టు చాలా గొప్పగా అబద్ధాలాడారని, నిలువునా మునిగిన రైతును ఆదుకునే విషయంలోనూ ఇంకా మాయమాటలే చెబుతున్నారని, ఇంతటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని గతంలో చూడలేదని, ఇకపై చూడబోమని విమర్శించారు. జగన్ పాలనలో రైతు వెన్నుముక విరిగిందని, వారిని కాపాడుకోటానికి ఎంతటి పోరాటానికైనా తాము సిద్దమన్నారు.
పిల్లి మాణిక్యారావు, కనపర్తి శ్రీనివాసరావులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఒక మంత్రికి వత్తాసు పలుకుతున్నారని, తెనాలికి ఉన్న శాంతియుత వాతావరణాన్ని, చరిత్రను పాడుచేస్తున్న ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన దీక్షలో పాల్గొన్న ఆనందబాబు, ఆలపాటి, ఇతర నాయకులకు చంద్రమోహనరెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. జై రైతన్న... జై అమరావతి నినాదంతో ప్రాంగణం హోరెత్తించారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, రైతు నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కళ్లం రాజశేఖరరెడ్డి, శావణ్‌కుమార్, అన్నాబత్తుని జయలక్ష్మి, పృథ్వీలత, డాక్టర్లు పాటిబండ్ల దక్షిణామూర్తి, వేమూరి శేషగిరిరావు, అవుల చక్రవర్తి, న్యాయవాది ఎస్.రామారావు, వీరవల్లి మురళి, కేసన కోటేశ్వరరావు, అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, శాఖమూరి నారాయణప్రసాద్, ఇతర నాయకులు పాల్గొన్నారు. దీక్ష సమయంలోనే టి.డి.పి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌లు ఆలపాటి, ఆనందబాబులకు ఫోన్‌చేసి దీక్షకు మద్దతు తెలిపారు.