-
-
Home » Andhra Pradesh » Guntur » Platform at GGH Railway Station
-
అన్నమో... రామచంద్రా
ABN , First Publish Date - 2020-03-25T09:33:20+05:30 IST
‘పర్చూరుకు చెందిన ఒక యువకుడు నగరంలోని ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నారు.

గుంటూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ‘పర్చూరుకు చెందిన ఒక యువకుడు నగరంలోని ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నారు. నెలకు రూ. 50వేల వరకు జీతం. ఆయన నిత్యం హోటళ్లలోనే భోజనం చేస్తూ క్వార్టర్స్‌లో తనకు కేటాయించిన ఫ్లాట్‌లో ఉంటారు. రెండు రోజుల నుంచి అతను అల్పాహారం, భోజనం దొరకక టీ, బిస్కెట్లతో ఆకలి తీర్చుకొంటున్నారు.’’
‘ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కూలీపనులు చేసుకొంటూ హోటళ్లపై ఆధారపడినవారి పరిస్థితి ఇదే. కుర్‌కురే, లేస్, చిప్స్ ప్యాకెట్లతో ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తోన్నారు.’’
‘జీజీహెచ్, రైల్వేస్టేషన్ వద్ద ప్లాట్‌ఫాంలపై ఉండే నిరాశ్రయులు మండుటెండలో ఉంటూ తమకు ఎవరైనా భోజనం ప్యాకెట్లు తెచ్చి ఇస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తోన్నారు.’
జనతా కర్ఫ్యూ... లాక్‌డౌన్‌తో నిరాశ్రయుల నుంచి నెలకు వేల రూపాయలు సంపాదించే ఉద్యోగుల్లో చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. జిల్లాకేంద్రంతోపాటు అన్ని ప్రాంతాల్లో హోటళ్లు, మెస్‌లు, టిఫిన్ సెంటర్లు మూతపడటంతో వారు ఆకలి తీర్చుకోవడం కష్టతరమైపోయింది. కనీసం పండ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండురోజుల నుంచి వారంతా టీ,బిస్కెట్‌లు, చిప్స్‌ప్యాకెట్లతో ఆకలి తీర్చుకొంటున్నారు. అవి కూడా కనాకష్టంగా దొరుకుతున్నాయి. అవి కూడా బుధవారం నుంచి లభించడం కష్టమని వ్యాపారస్థులు చెబుతున్నారు.
మంగళవారం ప్రకాశం జిల్లా నుంచి ఒక వ్యక్తి తన తల్లికి తీవ్ర అనారోగ్యం చేయడంతో నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ మంచినీళ్లు తప్ప మరే పదార్థం దొరకని పరిస్థితి. మరోవైపు ఆ మందులు, ఈ మందులు అంటూ డబ్బులు పిండేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆయన తన ఇంటికి వెళుతూ ఒక బడ్డీ దుకాణం వద్ద ఆగి అక్కడ ఉన్న రెండు అరటిపండ్లతో ఆకలి తీర్చుకొంటూ భోరున విలపించారు. ఈ పరిస్థితి మరెవ్వరికి రాకూడదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా కేంద్రంలో కనీసం పార్సిల్ కౌంటర్లను అయినా పరిమిత సంఖ్యలో అనుమతించాలని వారు కోరుతున్నారు.